Friday, November 22, 2024

భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. 10 రోజుల్లోనే 50 వేల బుకింగ్‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.116 చెల్లించి బుక్‌ చేసుకుంటే కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తలంబ్రాల బుకింగ్‌ జరుగుతోంది.

కాగా, శ్రీరామనవమి కల్యాణ సమయంలోనే కాకుండా తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదవకాశాన్ని కల్పించింది. కర్గో పార్సిల్‌ సెంటర్‌కు వెళ్లి రూ.116 చెల్లిస్తే నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించనుంది. ఈ సందర్భంగా టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి విసి సజ్జన్నార్‌ మాట్లాడుతూ భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందనీ, తెలంగాణ నుంచే కాకుండా దుబాయ్‌, అమెరికా వంటి విదేశాల నుంచి కూడా తలంబ్రాలు కావాలని అడుగుతున్నారని తెలిపారు.

- Advertisement -

నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా వినియోగిస్తున్నారనీ, విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తులు పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ కార్గో పార్సిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని ఈ సందర్భంగా బాజిరెడ్డి, సజ్జన్నార్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement