ఆర్ధిక కార్యకలాపాలు మెరుగ్గా ఉండటం, సర్వీస్ సెక్టర్ బలంగా ఉండటంతో పట్టణ ప్రాంత నిరుద్యోగం 4వ త్రైమాసికంలో 6.8 శాతంగా నమోదైంది. అందుకు ముందు త్రైమాసికంలో ఇది 7.2 శాతంగా ఉంది. నిరుద్యోగ రేటు 15 సంవత్సరాలకు పైబడిన స్త్రీ, పురుషుల్లో 2022-23 ఆర్ధిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 6.8 శాతంగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది 8.2 శాతంగా ఉందని సోమవారం నాడు ప్రభుత్వం విడుదల చేసిన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది. 2021 ఏప్రిల్- జూన్ కాలంలో అర్బన్ అన్ఎంప్లాయిమెంట్ 12.6 శాతంగా ఉంది. 2019-20 ఆర్ధిక సంత్సరం మొదటి త్రౖౖెమాసికంలో నిరుద్యోగం అత్యధికంగా 20.8 శాతంగా నమోదైంది. కరోనా మూలంగా లాక్ డౌన్ రావడంతో నిరుద్యోగం భారీగా పెరిగింది.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఎంప్లాయూస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ రెండింటిలోనూ పెరిగిన కొత్త సభ్యులను చూస్తే 2017-18 నుంచి అధికారిక ఉపాధి పొందిన వారి సంఖ్య పెరిగిందని ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక తెలిపింది. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స (పీఎంఐ) ప్రకారం చూస్తే ఈ కాలంలో ఉద్యోగాల కల్పన అంతంత మాత్రమేనని పేర్కొంది. పురుషుల్లో కంటే మహిళల్లోనే నిరుద్యోగం ఎక్కువగా తగ్గింది. లేబర్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యం 22.3 శాతం నుంచి 22.7 శాతానికి పెరిగింది. నిరుద్యోగం మాత్రం 9 శాతం కంటే ఎక్కువగానే ఉంది.
పురుషుల్లో నిరుద్యోగం ఈ త్రైమాసికంలో 6.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. మహిళల్లో నిరుద్యోగం 9.6 శాతం నుంచి 9.2 శాతానికి తగ్గింది. మహిళల పని స్వభావం గతం కంటే క్షీణించింది. గృహోపకరణ సంస్థలలో చెల్లించని సహాయకులను కలిగి ఉన్న స్వయం ఉపాధి వర్గంలోని మహిళల నిష్పత్తి మునుపటి త్రైమాసికంలో 37.9 శాతం నుంచి 38.5 శాతానికి పెరిగింది. వేతనాలు పొందుతున్న ఉద్యోగులు 54.5 శాతం నుంచి 54.2 శాతానికి తగ్గింది. రెగ్యులర్ వేతనాలు పొందే పురుష ఉద్యోగుల సంఖ్య మాత్రం 46.9 శాతం నుంచి 47.3 శాతానికి పెరిగింది.
లేబర్ఫోర్స్లో ఛత్తీస్ఘడ్…
రాష్ట్రాల వారీగా చూస్తే మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు 31.5 శాతంతో ఛత్తీస్ఘడ్ అగ్రస్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 30.5 శాతం, తమిళనాడు 27.4 శాతంతో తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ అత్యంత చెత్త రికార్డ్ కలిగి ఉంది. ఈ రాష్ట్రంలో మహిళ కార్మికుల భాగస్వామ్యం కేవలం 13.3 శాతంగా ఉంది. రాష్ట్రాల వారిగా నిరుద్యోగం చూస్తే, 12.5 శాతంతో ఛత్తీస్ఘడ్ టాప్లో ఉంది. అంతకు ముందు త్రైమాసికంలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగం 10.6 శాతంగా ఉంది. 11.9 శాతం నిరుద్యోగంతో రెండో స్థానంలో రాజస్థాన్ ఉంది. నిరుద్యోగం ఢిల్లిలో తక్కువగా 3.1 శాతం, పశ్చిమ బెంగాల్లో 4.2 శాతం, కర్నాటకలో 5.1 శాతంతో తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాలుగా నమోదయ్యాయి. ప్రభుత్వం వారంలో 7 రోజుల్లో ఎన్ని రోజులు ఉపాధి లభించిందన్న దాని ఆధారంగా నిరుద్యోగులను లెక్కించింది. ఇందు కోసం 1.73 లక్షల మందిని నుంచి ప్రభుత్వం వివరాలు సేకరించింది. వీటి ఆధారంగా ఈ డేటాను విడుదల చేసింది.