Saturday, November 23, 2024

Under – 19 Final | 66 పరుగుల తేడాతో భారత్ (ఏ) విజయం

(ఇబ్రహీంపట్నం ప్రభ న్యూస్) : అండర్ – 19 పురుషుల అంతర్జాతీయ చతుర్ముఖ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ (ఏ) జట్టు విన్నర్ గా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. మూలపాడు గోకరాజు లైలా గంగరాజు క్రికెట్ స్టేడియంలో ఈ నెల 13 నుంచి మూలపాడులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పర్యవేక్షణలో జరిగిన క్వాడ్రాంగ్యులర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సోమవారం ముగిసింది.

టోర్నీలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్ (ఏ), భారత్ (బీ) జట్లు పాల్గొన్నాయి. భారత్ (ఏ) – భారత్ (బీ) జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ (బీ)పై భారత్ (ఏ) జట్టు 66 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీ గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో ఇంగ్లండ్ జట్టుపై బంగ్లాదేశ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ (ఏ) జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 359 భారీ స్కోరు నమోదు చేసింది. జట్టులోని ముషీర్ ఖాన్ 127 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యారు. జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో ముషీర్ ఖాన్ కీలకపాత్ర పోషించారు. 360 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ (బీ) జట్టు పోరాట పటిమను ప్రదర్శించింది. తొలుత ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించి వరుసగా వికెట్లు చేజార్చుకుంది.

- Advertisement -

భారీ స్కోరును ఛేదించలేక 48 ఓవర్లలో 293 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. భారత్ (ఏ) జట్టులోని ముషీర్ ఖాన్ బౌలింగ్ లో రాణించి 53 పరుగులకు రెండు వికెట్లు తీసుకున్నారు. మూడవ స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసిన 304 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ప్రారంభంలో ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ప్రారంభించి చివరిలో దూకుడు ప్రదర్శించింది. ఇంగ్లండ్ ను ఓడించి మూడో స్థానంలో నిలిచింది.

టోర్నమెంట్ ను అద్భుతంగా నిర్వహించాం: రాకేష్

టోర్నమెంట్ లో విన్నర్ గా నిలిచిన భారత్ (ఏ) జట్టుకు ఏసీఏ జాయింట్ సెక్రటరీ ఎ.రాకేష్ ట్రోఫీని అందజేశారు. బీసీసీఐ అబ్జర్వర్లు, స్కారర్లు, ఇతర ప్రతినిధులకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రత్యేక మెమొంటోలు అందజేశారు. అనంతరం రాకేష్ మాట్లాడుతూ ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి సహకారంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా టోర్నమెంట్ ను అద్భుతంగా నిర్వహించామని చెప్పారు. బీసీసీఐ అంచనాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి విజయవంతం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు.

ప్రతి ఏటా చతుర్ముఖ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని ఈ ఏడాది నిర్వహించిన సిరీస్ ప్రత్యేకమైనదన్నారు. బీసీసీఐ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్ లు నిర్వహించేందుకు స్ఫూర్తినిచ్చిందన్నారు. భవిష్యత్ లో మంచి క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రతి జిల్లాలో సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఎన్.గీత, జితేంద్రనాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement