ప్రభన్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని బస్టాండ్‌ల ఆవరణలోని షాపులో నిలువు దోపిడి జరుగుతుంది. బస్టాండ్ కి వచ్చిన ప్రయాణికులు వాటర్ బాటిల్ కొంటే వారి వద్ద రూ.25వసూలు చేస్తున్నారు ఆ షాపు యజమానులు. బాటిల్ పై ఎంఆర్‌పీ రూ.20అని స్పష్టంగా ముద్రించి ఉన్నా.. బాటిల్‌కు రూ.25 వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రయాణికులు అడిగితే కూలింగ్ ఛార్జీలంటూ ఉల్టా దబాయిస్తున్న పరిస్తితి. ఇలా.. జూబ్లి, ఎంజీబీఎస్ నుంచి మొదలుకుని దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి తదితర చిన్నా చితకా బస్టాండ్లలో సైతం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్క వాటర్ అని కాదు తినే ఆహార పదార్థాలన్నింటిపై నిర్ణయించిన రేట్లకన్నా అధికంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ వచ్చిన తర్వాత బస్టాండ్లను ప్రక్షాళన చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నారు.
బస్టాండ్ ఆవరణలోని షాపులు, ఇతర ప్రధానమైన ప్రాంతాల్లో… ఈ బస్టాండ్‌లోని షాపుల్లో అన్ని వస్తువులు ఎంఆర్‌పీకే విక్రయించబడును అనే బోర్డులను తగిలించి మానిటరింగ్ చేశారు. అయితే గత కొంత కాలంగా అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే వ్యాపారులు తిరిగి గతంలో లాగే ఎంఆర్‌పీ రేట్ కంటే అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అలాగే నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లలో పారిశుద్ధ్యనిర్వహణ సరిగా లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం, వ్యర్థాలను తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందనే విమర్శలున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అత్యవసరమై మరుగు దొడ్లకు వెళ్తే… దుర్గందాన్ని భరించలేక తీవ్ర ఇంబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.
అలాగే మరుగు దొడ్డికి రూ.5వసూలు చేయాల్సి ఉండగా రూ.10 వసూలు చేస్తున్నారు. మూత్రశాలకు వెళ్లే వారివద్ద రూ.2 వసూలు చేయాల్సి ఉండగా రూ.5వసూలు చేస్తున్నారు. మరుగుదొడ్లలో కనీస పారిశుద్ధ్య మేయింటనెన్స్ చేయకుండానే నిర్దేశించిన రుసుం కంటే అధికంగా వసూలు చేయడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నియంత్రణ కరువు
నగరంలోని బస్టాండ్లలోని షాపుల్లో వస్తువులను అధిక రేట్లకు అమ్ముతున్నా ఆర్టీసీ అధికారులు నియంత్రించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. షాపుల్లో వస్తువులను అధిక రేట్లకు అమ్ముతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలున్నాయి. అధిక ధరలపై ఎవరైనా ప్రయాణికులు ఇదేంటని అడిగినప్పుడు వ్యాపారులు వారితో వాదనలకు దిగుతున్న సందర్బాలున్నాయి. గట్టిగా నిలదీసిన వారికి ఎంఆర్‌పీ రేట్లకు, మనకెందుకు గొడవ అనుకునే వారి వద్ద దర్జాగా అధిక రుసుం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఆర్టీసీ విజిలన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి బస్టాండ్లలో వ్యపారుల దోపిడీని అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.