Tuesday, November 26, 2024

ఐఫోన్‌ సంస్థలో ఆగని ఆందోళనలు.. కార్మికులకు మరింత బోనస్ ప్రకటన

చైనాలో ఉన్న యాపిల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌లో కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీని వల్ల ఈ సారి ఐఫోన్‌ ప్రో తయారీలో 60 లక్షల యూనిట్ల వరకు కొరత ఏర్పడే అవకాశం ఉందని యాపిల్‌ అంచనా వేసింది. అనిశ్చితి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తయారీ అంచనాల్లో ఇంకా తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని కూడా కంపెనీ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌ ఆంక్షలకు వ్యతిరేకంగా కార్మికులు ఆం దోళనలు చేస్తున్నారు. వీరు తిరిగి డ్యూటీలో చేరే వరకు తయారీలో అనిశ్చితి ఇలాగే కొనసాగుతుందని యాపిల్‌ కంపెనీ అంచనా వేస్తోంది. చైనాలో మళ్లి కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.

ఈ పరిణామాల మూలంగా స్టాక్‌ మార్కెట్‌లో సోమవారం నాడు యాపిల్‌ కంపెనీ షేరు విలువ 2.6 శాతం తగ్గి 144.22 డాలర్లకు చేరింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కంపెనీ షేరు విలువ 19 శాతం తగ్గింది. చైనాలో ని ఝాంగ్జో లో ఫ్యాక్స్‌కాన్‌ ప్లాంట్‌ ఉంది. అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 10 మధ్య లో ప్లాంట్‌ను వదిలి వెళ్లిన కార్మికులు తిరిగి డ్యూటీలకు వస్తే వేతనానికి అదనంగా గంటకు 30 యాన్లు (4.20 డాలర్లు) ఇస్తామని కంపెనీ ప్రకటించింది. కోవిడ్‌ ఆంక్షలతో ఈ ప్లాంట్‌ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు వెళ్లిపోయారు. కొత్తగా వచ్చిన కార్మికులు సైతం సరైన వసతులు లేవని, వేతనాలు ఇవ్వడంలేదని ఆందోళనకు దిగారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు అత్యధికంగా ఈ ప్లాంట్‌లోనే తయారువుతున్నాయి.

కార్మికుల ఆందోళనలతో యాపిల్‌ కంపెనీ ఐఫోన్ల తయారీని 90 మిలియన్‌ యూనిట్ల నుంచి 87 మిలియన్‌ యూనిట్లకు తగ్గించింది. రెండు వారాలుగా కంపెనీ ఉత్పత్తి అంచనాలను సవరిస్తూ వస్తోంది. అమెరికాలో క్రిస్మస్‌ సందర్భంగా భారీ ఎత్తున ఐఫోన్ల అమ్మకాలు జరుగుతాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఐఫోన్‌ తయారీలో ఇబ్బందులను అధిగమించేందుకు ఫ్యాక్స్‌కాన్‌ ప్రయత్నిస్తోంది. కార్మికులకు బోనస్‌ ఆఫర్‌ చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫ్యాక్టరీ ప్రాంతంలో లాక్‌ డౌన్‌ ఆంక్షలకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో కంపెనీ వరసగా కార్మికులకు అదనపు చెల్లింపులు చేస్తామని ప్రకటిస్తోంది. నవంబర్‌లో పనిలో చేరిన వారికి డిసెంబర్‌, జనవరి నెలలో 13 వేల యూన్ల వేతనం చెల్లిస్తామని తెలిపింది. ఐఫోన్‌ తయారి కోసం ఫ్యాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో 2 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement