Friday, November 22, 2024

Delhi | అదానీ అంశంపై ఆగని ఆందోళన.. పార్లమెంట్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కీలకమైన హిండెన్‌బర్గ్ అంశంపై చర్చకు అనుమతించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఉభయసభల్లో ఐదో రోజూ హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై ఆందోళన కొనసాగింది. అదానీ రిపోర్ట్‌పై బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇస్తూ చర్చకు పట్టు బడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు హిండెన్ బర్గ్ అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాజ్యసభ, లోక్‌సభల నుంచి వాకౌట్ చేశారు.

మోదీ – అదానీల కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని విపక్షాలతో కలిసి నినాదాలు చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. జేపీసీ ద్వారా విచారణ జరపాలని, మోదీ, అదానీలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేతలు కె. కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు లు మీడియాతో మాట్లాడారు. అదానీ హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై విపక్ష పార్టీలన్నీ చర్చ కోరుతూ ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇస్తుంటే ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎంపీలమంతా ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement