ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో ఆర్బీఐ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. దీనిపై వివరణ ఇస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ గురువారం నాడు సమావేశం కానుందని చెప్పారు. నివేదికను బహిర్గతం చేయలేమని ఆయన స్పష్టం చేశారు. దీంట్లో ఎలాంటి దాపరికాలు లేవని, ప్రభుత్వం, కేంద్ర బ్యాంక్ మధ్య జరిగే సమాచార బదిలీని బహిర్గతం చేసేందుకు నిబంధనలు అంగీకరించవని చెప్పారు. బుధవారం నాడు జరిగిన ఎఫ్‌ఐబీఏసీ వార్షిక సమావేశంలో ప్రసంగించారు.
ధరలను అదుపు చేసేందుకు తీసుకునే చర్యల విషయంలో తొందరపడి ఉండే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము సమయానుసారంగా స్పందించామని ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ఆయన సమర్ధించుకున్నారు. ధరలు పెరుగుతున్నప్పటికీ వడ్డీ రేట్లు పెంచకపోడం ద్వారా కీలక సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థకు అండగా ఉన్నామని స్పష్టం చేశారు. దీని వల్లే దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలకుండా అడ్డుకోవడం సాధ్యమైందన్నారు. ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయకుండా రేట్లను తక్కువగా ఉంచడం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
వరసగా మూడు త్రైమాసికాల పాటు రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగా ఉండడానికి గల కారణాలను నివేదికలో పొందుపరుస్తామన్నారు. ఆర్బీఐ పెట్టుకున్ను టార్గెట్‌ను ఎప్పటిలోగా సాధించగలమో కూడా ప్రభుత్వానికి ఈ నివేదికలో తెలియచేస్తామని చెెప్పారు. డాలర్‌తో రూపాయి విలువ తగ్గడంపై ఆయన స్పందిస్తూ దీన్ని భావోద్వేగ కోణంలో చూడవద్దని కోరారు. మన కరెన్సీ సాధారణంగానే స్పందిస్తుందన్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ మరింత కఠినంగా వడ్డీరేట్లను పెంచకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ద్రవ్య లభ్యత పెరిగేలా చూడాల్సి ఉందని చెప్పారు.
డిజిటల్ కరెన్సీ వ్యాపార లావాదేవీల్లో గణనీయమైన మార్పు తీసుకు వస్తుందని శక్తికాంతదాస్ చెప్పారు. ఈ నెల ఒకటిన ఆర్బీఐ ఇ-రూపీని లాంచ్ చేసింది. మొదటి రోజే 257 కోట్లకు పైగా ఇ-రూపీ లావాదేవీలను నిర్వహించింది. మరో నెల రోజుల్లో రిటైల్ ఇ-రూపీని కూడా ప్రారంభిస్తామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.