Wednesday, November 20, 2024

TG | ప్రజా గొంతుకైన కేటీఆర్‌కి సమాధానం చెప్పలేక చిల్లర వేషాలు : మాజీ మంత్రి జగదీశ్‌

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై పోలీసుల దాడిని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఖండించారు. కారణం, వారెంట్ లేకుండా ఎలా శోధిస్తారని ప్రశ్నించారు. ఎక్కడో ఏదైనా జరిగితే దానికి కేటీఆర్‌కి సంబంధం ఎంట‌ని నిలదీశారు. నిజాం కాలంలో కూడా ఇంత దుర్మార్గంగా పని చేయలేదని అన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయని…. వారి ఇళ్లపై ఇలాగే దాడులు చేసే దమ్ముందా అని పోలీసులను ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి ఇంట్లో విదేశీ వాచీల వ్యవహారం ఎటుపోయిందని జగదీశ్‌ రెడ్డి ప్రశ్నించారు. మంత్రుల ఇళ్లలో సోదాలు చేస్తే మీరు అనుకున్నవి దొరుకుతాయని అన్నారు.

చిల్లర దాడులు తమను భయపెట్టలేవని… తమకు అరెస్టులు కొత్త కాదని జగదీశ్‌ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతగా కేటీఆర్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇలా దాడులు చేస్తున్నారని విమర్శించారు. లేనివి ఉన్నట్టు సృష్టించి కేసులు బనాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రజా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేటీఆర్‌ను ప్రజలే రక్షించుకుంటారని అన్నారు. సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్‌, రేవంత్‌ రెడ్డిలో ఎవరికి ఎంత ఛరీష్మా ఉందో తెలుస్తుందని అన్నారు.

రౌడీల్లాగా చట్టవిరుద్దంగా పోలీసులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట పరిధిలో పనిచేయకపోతే డీజీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. తప్పకుండా తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ చెప్పినట్లు కాకుండా పోలీసులంతా చట్ట పరిధిలో పనిచేయాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement