Tuesday, November 19, 2024

ఎంబీఏ, ఎంసీఏకు తగ్గని క్రేజ్‌.. మొదటి విడత ఐసెట్‌ సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంసీఏ, ఎంబీఏకు ఏమాత్రం ఆదరణ తగ్గడంలేదు. ప్రతి ఏటా సీట్లు దాదాపు నిండుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే ఎంసీఏ, ఎంబీఏ సీట్లు నిండిపోతున్నాయి. మిగతా కోర్సుల్లో ఆ పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్యకు చాలా డిమాండ్‌ ఉంది. అయినా కానీ ఇంజనీరింగ్‌ సీట్లు ప్రతి ఏటా స్పాట్‌ అడ్మిషన్ల వరకు సీట్లు మిగిలిపోతుండటమే కాకుండా ఎంతో కొంత సీట్లు ఖాళీగానే మిగిలే పరిస్థితి ఉంది. కానీ టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు నిర్వహించే అడ్మిషన్లు దాదాపు 90 శాతం వరకు సీట్లు కేవలం మొదటి విడతలోనే భర్తీ అవుతున్నాయి. సైన్స్‌ గ్రూపు వారు ఇంజనీరింగ్‌ కోర్సు చేస్తే మంచి ప్యాకేజీతో ఉద్యోగం పొందొచ్చనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అలాగే కామర్స్‌, ఆర్ట్స్‌ చేసే వారు, ఇంజనీరింగ్‌లో సీటు పొందని వారు ఎంసీఏ కోర్సును ఎంచుకుంటున్నారు. ఇంజనీరింగ్‌కు సమానంగా ఎంబీఏ, ఎంసీఏ చేయడం ద్వారా మంచి ఉద్యోగం పొందుతామనే అభిప్రాయం విద్యార్థుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్‌ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్‌ ఉన్న కోర్సులు ఎంబీఏ, ఎంసీలు ఉన్నాయి.

ఎంసీఏతో సాఫ్ట్‌ వేర్‌ వైపు…

సాంకేతిక విద్యవైపు ఆసక్తి ఉన్న వారు మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) కోర్సును ఎంపిక చేసుకుంటున్నారు. సాఫ్ట్‌ వేర్‌ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఎంసీఏ అనేది చక్కటి ప్రత్యామ్నాయ మార్గం. అందుకే ఎక్కువగా డిగ్రీలో సైన్స్‌ గ్రూపు చేసిన వారు ఈ కోర్సునే ఎంచుకుంటారు. ఐసెట్‌కు మొత్తం 61613 మంది అర్హత సాధించగా 31,955 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. రాష్ట్రంలోని 261 కాలేజీల్లో 26,201 ఎంబీఏ, ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటి విడత సీట్ల కేటాయింపులో మంగళవారం నాడు 23,001 సీట్లను కేటాయించారు. అందులోనూ 77 కాలేజీల్లో సీట్లు వంద శాతం నిండాయి. జీరో అడ్మిషన్లు నమోదైన కాలేజీ ఒక్కటి కూడా లేదు.

- Advertisement -

ఎంబీఏ సీట్లే ఎక్కువ…

రాష్ట్రంలో ఎంసీఏ కంటే ఎంబీఏ (మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌) సీట్లే ఎక్కువగా ఉన్నాయి. గ్రాడ్యుయేషన్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ విభాగంలో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలనుకునే వారు ఎంబీఏను కెరీర్‌గా ఎంచుకుంటారు. ఎంబీఏకు కూడా అభ్యర్థుల్లో చాలా డిమాండ్‌ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంసీఏ ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలు 43 ఉంటే, అందులో 2676 సీట్లు ఉన్నాయి. 16 ప్రభుత్వ కాలేజీల్లో 977 సీట్లు ఉండగా, వాటిలో మొత్తం సీట్లు నిండాయి. 27 ప్రైవేట్‌ కాలేజీల్లో 1699 సీట్లల్లో 1696 సీట్లను కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే 43 కాలేజీల్లోని 2676 ఎంసీఏ సీట్లల్లో 2673 (99.89) శాతం సీట్లు నిండాయి.

ఇక రాష్ట్రంలోని 252 కాలేజీల్లో 23525 సీట్లు ఉన్నాయి. అయితే 20 ప్రభుత్వ కాలేజీల్లో 1465 సీట్లకువ గానూ 1386 సీట్లు నిండాయి. 2 ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 182 ఎంబీఏ సీట్లకు 169 సీట్లు, 230 ప్రైవేట్‌ కాలేజీల్లో 21,878 ఎంబీఏ సీట్లల్లో 18781 సీట్లను కేటాయించారు. మొత్తంగా 252 ఎంబీఏ కాలేజీల్లోని 23525 సీట్లల్లో 20,336 (86.44 శాతం) ఎంబీఏ సీట్లు భర్తీ కాగా ఇంకా 3189 సీట్లు మిగిలాయి. మిగిలిన సీట్లను రెండో దశ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 829 మంది అభ్యర్థులు సీటు పొందినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఐసెట్‌ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 21 వరకు కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement