ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇండియాలో కరోనా కేసుల భయానికి కొందరు ఆటగాళ్లు టోర్నీ వదిలి వెళ్లిపోగా.. తాజాగా ఇద్దరు స్టార్ అంపైర్లు కూడా గుడ్‌బై చెప్పారు. అందులో ఒకరు ఇండియన్ అంపైర్ నితిన్ మీనన్ కాగా.. మరొకరు ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రైఫిల్. ఈ ఇద్దరూ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్లే కావడం గమనార్హం. ఈ ఇద్దరూ కరోనా సంబంధిత కారణాల వల్లే ఐపీఎల్‌ను వదిలి వెళ్లిపోయారు.
నితిన్ మీనన్ భార్య, తల్లికి కరోనా సోకింది. నితిన్‌కు ఓ పాప ఉండటంతో ఆమెను చూసుకోవడానికి తాను వెళ్లాల్సిందే అంటూ అతడు తన సొంతూరు ఇండోర్‌కు వెళ్లిపోయాడు. మరోవైపు పాల్ రైఫిల్ తాను ఇంటికి వెళ్లగలనో లేదోనన్న ఆందోళన కలుగుతోందంటూ ఆస్ట్రేలియా విమానాలపై నిషేధం విధించక ముందే వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా ధృవీకరించింది. ఈ ఇద్దరి స్థానంలో ఇప్పటికే కొందరు స్థానిక అంపైర్లను బ్యాకప్‌గా ఉంచింది బీసీసీఐ. మీనన్, రైఫిల్‌లకు షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ల బాధ్యతలను వాళ్లకు అప్పగించనుంది. కరోనా కారణంగానే భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆండ్రూ టై, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఐపీఎల్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.