Tuesday, November 19, 2024

ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు భారత్‌లోనే అవకాశం కల్పించాలి.. జంతర్ మంతర్ వద్ద ఆందోళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వైద్య విద్యను అర్థాంతరంగా వదులుకుని భారత్ తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు భారత్‌లోనే చదువు కొనసాగించే అవకాశం కల్పించాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వైద్యవిద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ‘ఆపరేషన్ గంగ’ పేరుతో భారత ప్రభుత్వం సాహసోపేతంగా యుద్ధభూమి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించిందని, ఈ విషయంలో తాము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. అయితే అర్థాంతరంగా ఆగిపోయిన వారి వైద్య విద్యను భారత్‌లోనే కొనసాగించే అవకాశం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో ఉక్రెయిన్ బాధిత వైద్యవిద్యార్థులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఉక్రెయిన్ బాధిత వైద్యవిద్యార్థులకు పోలండ్, హంగేరీ సహా ఇతర యురోపియన్ దేశాల్లో విద్యను కొనసాగించేలా ఆయాదేశాలతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ పరిస్థితి చూస్తుంటే యుద్ధం ఉక్రెయిన్ దాటి పోలండ్ వరకు విస్తరించేలా ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇతర యురోపియన్ దేశాల కంటే భారత్‌లోనే విద్యను కొనసాగించేలా అవకాశం కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు.

వెళ్లలేరు.. ఉండలేరు: చంద్రశేఖర్

మా పాప ఉక్రెయిన్‌లో మెడిసిన్ 4వ సంవత్సరం చదువుతోంది. యుద్ధం కారణంగా తిరిగొచ్చాక, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడే చదివిస్తానన్నారు. కానీ కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి హామీ రాలేదు. విద్యార్థుల పరిస్థితి తిరిగి ఉక్రెయిన్ వెళ్లలేరు, ఇక్కడే ఉండలేరు అన్నట్టుగా ఉంది. మా పిల్లలకు ఇక్కడే చదువు కొనసాగించే అవకాశం కల్పించండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1,800 మంది ఉక్రెయిన్ బాధిత వైద్యవిద్యార్థులు ఉన్నారు. వీరందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలలో చదువు కొనసాగించేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ప్రతి కాలేజీలో 10 మందికి అవకాశమిచ్చినా, అందరికీ న్యాయం జరుగుతుంది. ఉక్రెయిన్ పక్కనున్న పోలండ్‌లో చదివు కొనసాగించేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ యుద్ధం అక్కడికి కూడా విస్తరించేలా ఉంది.

యుద్ధం నుంచి రక్షించారు, భవిష్యత్తును కూడా రక్షించండి: శ్రీనివాస్ (విద్యార్థి తండ్రి)

- Advertisement -

మా బాబు వీరవంశీకృష్ణ ఉక్రెయిన్‌లోని ఇవానోఫ్రాన్స్‌విస్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అక్కడి నుంచి విద్యార్థులను రక్షించి తీసుకొచ్చిన విధంగా, భారత్‌లోనే ఉన్న మెడికల్ కాలేజీలలో చదివించే ఏర్పాటు చేయాలి. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. వైద్యోనారాయణో హరి అంటూ వైద్యులను దేవుళ్లతో సమానంగా భావించే భారతదేశంలో ఈ వైద్యవిద్యార్థుల భవిష్యత్తు గురించి కేంద్రం ఆలోచించాలి.

కేంద్రం దృష్టికి తీసుకొచ్చేందుకే: అశోక్ గౌడ్ (విద్యార్థిని తండ్రి)

మా అమ్మాయి వైతరిణి గౌడ్‌ను ఆపరేషన్ గంగ ద్వారా స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చింది. జంతర్ మంతర్ వద్ద మూడోసారి ధర్నా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే ఈ ప్రదర్శన చేపట్టాం. యుద్ధభూమి నుంచి ఎలాగైతే తీసుకొచ్చారో అలాగే వారికి ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నాను.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement