Saturday, November 23, 2024

డోన్‌బాస్‌లో ఉక్రెయిన్‌ దళాలు తిరుగుముఖం?

తూర్పు ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతం డోన్‌బాస్‌లో రష్యా బలగాలు దూసుకుపోతున్నాయి. వారి ధాటికి తట్టుకోలేక ఉక్రెయిన్‌ దళాలు వెనక్కు మళ్లుతున్నాయి. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌ తన దళాలను అధికారికంగా ఉపసంహరించుకునే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ప్రత్యేకించి లుషాంక్‌ ప్రాంతంలో పరిణామాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు లిమన్‌ నగరాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. కాగా డోన్‌బాస్‌లోని అతిపెద్ద పట్టణమైన సీవీరొడోనెట్‌స్క్‌లో పట్టు సాధించేందుకు రష్యా తీవ్రంగా పోరాడుతోందని, నగరంలోకి ఆ దేశ బలగాలు చేరుకున్నాయని లుషాంక్‌ గవర్నర్‌ సెరిహియ్‌ గైడాయ్‌ శనివారం ప్రకటించారు. ఈ ప్రాంతంనుంచి ఉక్రెయిన్‌ బలగాలు తిరుగుముఖం పడుతున్నాయని స్పష్టం చేశారు. కాగా డోన్‌బాస్‌లో రష్యా దళాలు పురోగతి సాధించాయని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కూడా ధ్రువీకరించారు.

మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థన మేరకు మరిన్ని ఆయుధాలు పంపించేందుకు జాన్సన్‌ అంగీకరించారు. ఇరువురు నేతలు శనివారం ఫోన్‌లో చర్చలు జరిపారు. రష్యాను నిలువరించాలంటే అత్యాధునిక,భారీ ఆయుధాలు అవసరమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. నిజానికి లుషాంక్‌, డోనెట్‌స్క్‌ ప్రాంతాలను స్వాధీనం చేసుకునే లక్ష్యంతోనే ఉక్రెయిన్‌పై సైనికచర్యకు రష్యా దిగిన విషయం తెలిసిందే. రష్యా దాడిలో సీవీరోడోనెట్‌స్క్‌లోని 90 శాతం భవనాలు ధ్వంసమైనాయని గవర్నర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా డోన్‌బాస్‌లో రష్యా పురోగతి వార్తలను జెలెన్‌స్కీ కొట్టి పారేశారు. లిమన్‌, సీవీరొడోునెట్‌స్క్‌ పట్టణాలను స్వాధీనం చేసుకున్నంతమాత్రాన డోన్‌బాస్‌ అంతా పుతిన్‌ చేజిక్కినట్టు కాదని స్పష్టం చేశారు. డోనెట్‌స్క్‌, సీవీరోడోనెట్‌స్క్‌లలో ఎనిమిది ప్రాంతాల్లో రష్యా దళాలను తరిమికొట్టామని ఉక్రెయిన్‌ సైనిక బలగాల జనరల్‌ ప్రకటించారు. కాగా లైమన్‌ నగరాన్నిరష్యా స్వాధీనం చేసుకుందని, డోన్‌బాస్‌ రీజియన్‌లో ఇది అతిపెద్ద రైల్వే జంక్షన్‌ కావడం, డోనెట్స్‌ నదిపై పట్టు సాధించడంవంటివి రష్యాకు కలసిరానున్నాయని బ్రిటన్‌ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement