Tuesday, November 26, 2024

సైనికుడిలాజెలెన్‌ స్కీ, మాటలే తుటాలై.. వెన్ను చూపని ధైర్యశీలి..

ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్మీలో రష్యా కూడా ఒకటి. రష్యాతో పోలిస్తే.. ఉక్రెయిన్‌ చాలా చిన్న దేశం. పిచుకపై బ్రహ్మాస్త్రంతో పోల్చొచ్చు.. కానీ.. ఆ పిచుకే.. బ్రహ్మాస్త్రానికి ఎదురెళ్లుతున్నది. ఉక్రెయిన్‌ ఆర్మీ బలాన్ని అంచనా వేయడంలో రష్యా బలగాలు కొంత వరకు విఫలం అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్‌ సైన్యం ఇంత ధీటుగా పోరాడేందుకు ఒకే ఒక కారణం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ధైర్యం. ప్రతీ సైనికుడిని, ప్రతీ పౌరుడిని రష్యన్‌ ఆర్మీతో పోరాడేందుకు రంగంలోకి దించారు. ఆఫ్గానిస్తాన్‌పై తాలిబన్లు దండయాత్రకు వచ్చిన సమయంలో ఆ దేశ అధ్యక్షుడు పారిపోయాడు. కానీ జెలెన్‌ స్కీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉక్రెయిన్‌లోనే ఉంటూ.. ప్రతీ ఒక్కరినీ ఉత్సాహపరుస్తున్నాడు.

మాట తీరు భేష్‌..

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ను సభ్య దేశాలు మంగళవారం అత్యవసరంగా సమావేశపరిచాయి. ఈ సమావేశానికి ఈయూ సభ్య దేశాలతో పాటు రష్యా యుద్ధంతో శక్తివంచన లేకుండా పోరాడుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో జెలెన్‌ స్కీ చేసిన ప్రసంగానికి ఈయూ దేశాలు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. అతని మాట తీరు ఏంటో.. రష్యాకు వ్యతిరేకంగా అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. నాటో దేశాలు, అమెరికా హ్యాండ్‌ ఇచ్చినా.. వెన్ను చూపకుండా ధైర్యంగా రష్యన్‌ ఆర్మీని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌ను హస్తం గతం చేసుకోవాల్సిన రష్యాను.. ఆరు రోజుల పాటు నిలువరించారంటేనే జెలెన్‌ స్కీ ధైర్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

పారిపోలేదని వీడియోల విడుదల..

తాను ఉక్రెయిన్‌ విడిచి పారిపోలేదని, ఇక్కడే ఉన్నా అంటూ జెలెన్‌ స్కీ వీడియో విడుదల చేయడం కూడా ఆయన తెగువకు నిదర్శనం. రష్యా చేతికి దొరికితే.. తనతో పాటు మొత్తం కుటుంబాన్ని అంతం చేస్తారని తెలిసినా.. అక్కడే ఉంటూ.. దేశ హితం కోసం పాటుపడుతున్నాడు. రష్యా లాంటి దేశంతో ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. అలాంటిది రణ రంగంలో ఏకాకి అయిపోయినా.. మోకరిల్ల కుండా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. చర్చల సమయంలోనే.. రష్యా డిమాండ్‌లకు తలొగ్గి జీ హుజూర్‌ అనొచ్చు. కానీ అలా చేయలేదు. రష్యా ఏం చేసినా.. తమ డిమాండ్‌లపై ఎటూ కదలకుండా నిలబడి ఉన్నాడు. ప్రపంచంలో అంగ, అర్థ బలం కలిగిన భారీ మిలిటరీ సంపద ఉన్న దేశాల్లో రష్యా ఒకటి అని తెలిసినా.. వెనుకడుగు వేయలేదు. ఓ కామెడియన్‌ నుంచి దేశ అధ్యక్షుడిగా ఎదగడం వెనుక చిత్తశుద్ధి, ధైర్యం, తేజస్సు, నిశ్శబ్ద విశ్వాసం ఉన్న నాయకుడిగా ఎదిగాడు.

- Advertisement -

సోషల్‌ మీడియా శక్తి అందిపుచ్చుకుని..

అనుక్షణం ఉక్రెయిన్‌ ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతూ.. తానూ స్వయంగా యుద్ధంలో పాల్గొంటూ.. రష్యా సైన్యానికి చెమటలు పట్టిస్తున్నారు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ ప్రతిఘటనలో ముఖ్యంగా సోషల్‌ మీడియా శక్తిని ఉపయోగించుకోవడంలో అతను అతనికే సాటి అని చెప్పాలి. ఉక్రెయిన్‌లో యుద్ధం చెలరేగుతుండగా.. మిగిలిన ప్రపంచం ట్విట్టర్‌, టిక్‌టాక్‌ లెన్స్‌ ద్వారా రష్యా దాడిని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నది. చిన్న దేశంపై అగ్ర రాజ్యం జరుపుతున్న దౌర్జన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి ఉక్రెయిన్‌కు సాయం అందుతూనే ఉంది. ప్రపంచ దేశాలు ఏకాకిని చేసినా.. ఏ దేశంపై కూడా విమర్శలు చేయని పెద్ద మనస్సు ఉన్న నేతగా జెలెన్‌ స్కీ నిలిచాడు. యుద్ధ నీతిలో ఆరితేరిన వారు ఉక్రెయిన్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వారిని కూడా బయటికి తీసుకొచ్చి దేశం కోసం పోరాడేలా ఉత్సాహపరుస్తున్నాడు. మంగళవారం నుంచి రష్యా దూకుడు పెంచింది. కీవ్‌ నగరాన్ని హస్తగతం చేసుకునేందుకు భారీ సాయుధ బలగాలతో ఉక్రెయిన్‌ వైపు కదులుతున్నది. అయినా జెలెన్‌ స్కీ భయపడటం లేదు. చావడానికి అయినా.. చంపడానికి అయినా.. సిద్ధమే అని నిరూపిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement