Thursday, November 21, 2024

ఉక్రెయిన్‌ వార్‌ 100 రోజులు.. సుదీర్ఘ యుద్ధమే..!

కీవ్‌:ఉక్రెయిన్‌పై సైనికచర్య పేరుతో దండయాత్ర మొదలుపెట్టిన రష్యా యుద్ధం మొదలై వంద రోజులు దాటింది. పొరుగున ఉన్న చిన్న దేశం ఉక్రెయిన్‌ను రెండుమూడు రోజుల్లో దారికి తెచ్చుకోవచ్చని భావించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అంచనాలకు భిన్నంగా కీవ్‌ సేనలు, ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో వ్యూహాలు మారిపోయాయి. ఈ యుద్ధం ఇప్పటిలో తేలేలా కన్పించడం లేదు. ఇరు దేశాలు దీర్ఘకాలంపాటు యుద్ధం సాగుతుందన్న అంచనాతో అందుకు సిద్దమైనాయి. ఈ వంద రోజుల యుద్ధంలో ఉక్రెయిన్‌ నగరాలు, పట్టణాలను రష్యా ధంసం చేసింది. ఎక్కడికక్కడ నరమేధం సృష్టించింది. వందలాది మృతదేహాలను సామూహిక ఖననం చేసింది. అంతమాత్రాన రష్యా ఇంతవరకు ఒకటి రెండు నగరాలను సాధీనం చేసుకోవడం తప్ప చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు.

వ్యూహం మార్చిన రష్యా.. ముందడుగు

మొదట రాజధాని లక్ష్యంగా కీవ్‌, బుచావంటి ప్రాంతాలపై పెనుదాడులు నిర్వహించిన రష్యా ఎదురుదెబ్బలు తింది. భారీ సంఖ్యలో సైనికులను, కీలక హోదాలలో ఉన్న సైనికాధికారులను, యుద్ధట్యాంకులు, ఆయుధ సంపత్తిని కోల్పోయింది. ఈ వందరోజుల్లో కనీసం 30వేలమంది సైనికులను, 50మంది కల్నల్‌ స్థాయి సైనికాధికారులను, వందలాది యుద్ధ ట్యాంకులను, పదుల సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది. దిక్కుతోచని స్థితిలో వ్యూహం మార్చింది. కీవ్‌ సహా తొలి నలభై రోజుల్లో మోహరించిన ప్రాంతాలనుంచి వైదొలగింది. అవమానభారంతో వెనక్కుమళ్లింది. ఆ తర్వాత వ్యూహం మార్చి తూర్పు ఉక్రెయిన్‌పై దృష్టి సారించింది. ఆ ప్రాంతంలోని పోర్టు నగరాలు, సముద్ర మార్గాలను చేజిక్కించుకునేలా ఎత్తుగడ వేసింది. బయటి ప్రపంచంతో ఉక్రెయిన్‌ సముద్ర వాణిజ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించింది. రష్యా సరిహద్దులను ఆనుకుని ఉన్న తూర్పు ఉక్రెయిన్‌ను చేజిక్కించుకుని తన అనుకూలవర్గాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న క్రిమియాతో అనుసంధానం చేసే దిశగా యుద్ధం చేస్తోంది. అజోవ్‌ సముద్రతీరంలోని నౌకాశ్రయ నగరం మరియపోల్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత కీలకమైన డాన్‌బోస్‌-లుషాంక్‌ ప్రాంతాలను చేజిక్కించుకునేలా అన్నివైపుల నుంచి దాడులు చేస్తోంది. లుషాంక్‌లోని అతి కీలక నగరం సీవీరోడోనెట్‌స్కీని దాదాపు స్వాధీనం చేసుకుంది. అనేక పల్లెల్లో జెండా ఎగరేసింది. గతంలో ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లో మోహరించిన శతఘ్ని, వైమానిక, కాల్బలాన్ని తూర్పు ఉక్రెయిన్‌కు తరలించిన రష్యా క్షిపణులు, బాంబులు, రాకెట్లతో దాడులు చేస్తోంది. మరియపోల్‌ మాదిరిగా సీవీరోడోనెట్‌స్కీ నగరంలోని రసాయనిక కర్మాగారంలో ప్రజలు తలదాచుకునే పరిస్థితి కల్పించింది. వేలాదిమంది ఇప్పటికే వలసవెళ్లారు. డాన్‌బోస్‌ పరిథిలోని లుషాంక్‌ ప్రాంతంలోని ఈ నగరంలో 80 శాతం చేజిక్కించుకుంది. రేపోమాపో డాన్‌బోస్‌ మొత్తం రష్యా చేతుల్లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే పుతిన్‌ లక్ష్యం నెరవేరినట్టే. సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌ భూ భాగంలో రష్యా భాష మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలను చేజిక్కించుకోవడమే రష్యా లక్ష్యం. దాదాపు ఆ లక్ష్యాన్ని నెర వేర్చుకున్నట్లే. అంతమాత్రాన ఉక్రెయిన్‌ మొత్తం రష్యాకు లొంగిపోయిందనుకోవడం భ్రమే. కేవలం ఓ వెయ్యి కి.మి. విస్తీర్ణంలోని ఉక్రెయిన్‌ భూభాగంపైనే రష్యా పట్టు సాధించినట్లు చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రష్యాను నిలువరించేందుకు ఐరోపా, బ్రిటన్‌, అమెరికాతోపాటు మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. పెద్దఎత్తున ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయి. ఫలితంగా ఉక్రెయిన్‌ పోర్టుల్లో వందలాది సరకు రవాణా నౌకలు నిలిచిపోయాయి. వాటిల్లో లక్షల టన్నుల ఆహారధాన్యాలు ఉండిపోయాయి. ఈ పరిణామం ప్రపంచంలో ఆహార సంక్షోభానికి దారితీస్తోంది.

ఉక్రెయిన్‌ ప్రతిఘటన..

నాటో కూటమిలో చేరొద్దంటూ ఉక్రెయిన్‌ను హెచ్చరించిన రష్యా చివరకు సైనిక చర్య పేరుతో దండయాత్ర మొదలుపెట్టింది. క్షిపణులు, బాంబులు, రాకెట్లతో ముప్పేట దాడి చేస్తోంది. రష్యా అంచనాలకు భిన్నంగా ఎదురుదాడి చేస్తోంది. రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకులను చిన్నపాటి ద్రోన్లతో ధ్వంసం చేసింది. ఏకంగా వెయ్యి ట్యాంకులను రష్యా కోల్పోయింది. మాస్కోవా వంటి యుద్ధనౌకతోపాటు మరో రెండు నౌకలను ధ్వంసం చేసింది. మాస్కోవాపై నెప్య్టూన్‌ క్షిపణులతో దాడి చేయడంతో అది సముద్రంలో మునిగిపోయింది. ఆ సంఘటనలో ఏకంగా 560మందికి పైగా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దెబ్బతో రష్యా వైఖరి మరింత కఠినంగా మారిపోయింది. కీవ్‌నుంచి వెనుదిరిగి తూర్పు ఉక్రెయిన్‌పై దృష్టి సారించింది. ఉక్రెయిన్‌కు ఐరోపా సమాజం, అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు పెద్దఎత్తున ఆయుధాలు సరఫరా చేయడాన్ని తప్పుపడుతోంది. తాజాగా బిడెన్‌ ప్రభుత్వం అత్యాధునిక రాకెట్‌ వ్యవస్థలను సరఫరా చేస్తామని ప్రకటించడంతో రష్యా మండిపడుతోంది. ఉక్రెయిన్‌ ప్రతిఘటన ఈ స్థాయిలో ఉంటుందని, ఇతర దేశాలు ఇంత పెద్దఎత్తున సాయం చేస్తాయని రష్యా అంచనావేయలేకపోయింది. అవకాశం ఉన్న ప్రతి దేశం నుంచి ఉక్రెయిన్‌ ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ యుద్ధం దీర్ఘకాల కొనసాగుతుందని బహిరంగంగానే ప్రకటిస్తోంది. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోబమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పుడు ఉక్రేనియన్లకు ఓ హీరో. ప్రపంచ దేశాల్లో పేరుతెచ్చుకున్న సాహసి. కానీ ఈ యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం ఇంటాబయటా అపఖ్యాతిని మూటగట్టుకున్నారనే చెప్పాలి.

- Advertisement -

డాన్‌బోస్‌లో భీకర పోరు..

ఉక్రెయిన్‌లోని కేవలం తూర్పుప్రాంతంలోనే రష్యా దళాలు మోహరించాయి. ఆ ప్రాంతంలోని కీలక నగరాలపై ముప్పేట దాడి చేస్తున్నాయి. బెలారస్‌ సరిహద్దుల మీదుగా బలగాలను తరలించిన రష్యాను ఉక్రెయిన్‌ ప్రతిఘటిస్తున్నప్పటికీ ఫలితం కన్పించడం లేదు. రష్యాతో యుద్ధ మొదలయ్యాక రోజూ కనీసం వందమంది సైనికులను కోల్పోతున్నట్లు జెలెన్‌స్కీ స్వయంగా ప్రకటించారు. ఖార్కీవ్‌, లుషాంక్‌ వంటి ప్రాంతాల్లో రష్యా దూకుడుగా వెడుతోంది. అయితే ఇంకా పూర్తిస్థాయి పట్టు సాధించలేదు. రష్యా భారీ ఆయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్‌ నిలవలేకపోతోంది. అందుకే అమెరికా, పశ్చిమ దేశాలను ఆయుధ సహాయం కోసం జెలెన్‌స్కీ పదేపదే అభ్యర్థిస్తున్నారు. మరియపోల్‌, సీవీరీడోనెట్‌స్కీ, లిమన్‌, ఖేర్సన్‌లలో ఎక్కువ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న రష్యా ఇప్పుడు ఖార్కీవ్‌పై దృష్టి సారిస్తోంది. ఇక్కడ వందరోజులుగా యుద్ధం చేస్తున్నప్పటికీ పెద్దగా సాధించింది ఏమీ లేదు. పశ్చిమాన ఉన్న నౌకానగరం ఒడెస్సాపైనా పరిమిత దాడులు చేస్తున్న రష్యా నల్లసముద్రంలోని కీలకమైన నౌకానగరం ఖేర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఫలితంగా నల్లసముద్రంలో ఉక్రెయిన్‌ పట్టు తప్పింది. ప్రపంచ దేశాలను ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరకుండా రష్యా అడ్డుకోగలుగుతోంది. ఖేర్సన్‌లో తిరిగి పట్టు సాధిస్తే రష్యాను తరిమికొట్టడం ఉక్రెయిన్‌కు సాధ్యమే. అందుకే ఇక్కడ రష్యా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement