Friday, September 20, 2024

Ukraine Tour యుద్ద‌భూమిలో మోదీ… రెండు రోజులు అక్క‌డే…

ఉక్రెయిన్‌లో.. ప్ర‌ధాని మోదీ
10 గంటల పాటు రైల్లోనే జ‌ర్నీ
భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచిన ఉక్రెయిన్
కీలక చర్చలు జరపనున్న మోదీ, జెలెన్ స్కీ
దాదాపు 7 గంటల పాటు కొనసాగనున్న పర్యటన

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ చారిత్రక పర్యటన మొదలైంది. పోలండ్ పర్యటనను ముగించుకున్న ఆయ‌న‌.. అక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు రైల్లో చేరుకున్నారు. రైల్ ఫోర్స్ వన్ రైల్లో దాదాపు 10 గంటల పాటు ప్రయాణించి కీవ్‌లో అడుగుపెట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు భార‌త ప్ర‌ధాని ఆ దేశ పర్యటనకు వెళ్లారు. కీవ్ లోని రైల్వే స్టేషన్‌లో మువ్వన్నెల పతాకాలతో భారత సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఉక్రెయిన్ లోని ఇస్కాన్ బృందం కూడా స్వాగత కార్యక్రమంలో పాల్గొంది.

- Advertisement -

భ‌ద్ర‌తా కారనాల రీత్యా టూర్ వివ‌రాలు గోప్యం..

భద్రతా కారణాల కారణంగా ప్ర‌ధాని మోదీ పర్యటనలోని కార్యక్రమాల వివరాలను గోప్యంగా ఉంచారు. ఉక్రెయిన్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు మోదీ కీవ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య ఆయన కాన్వాయ్ మోదీ బస చేసే హయత్ హోటల్‌కు చేరుకుంది. హోటల్ వద్ద భారత సంతతి ప్రజలు మోదీకి స్వాగతం పలికారు. ఉక్రెయిన్ లో మోదీ పర్యటన దాదాపు ఏడు గంటల పాటు జరగనుంది. తన పర్యటనలో భాగంతో కీవ్‌లోని ఏవీ ఫొమిన్ బొటానికల్ గార్డెన్‌లో మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి నివాళి అర్పించ‌నున్నారు. 2020లో గాంధీ 151వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియంను మోదీ సందర్శించనున్నారు.

జెల‌న్‌స్కీతో సుధీర్ఘ భేటీ..

ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లను మ్యూజియంలో ఆయన వీక్షించనున్నారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు ఇక్కడ మోదీ నివాళి అర్పించనున్నారు. అనంతరం మరిన్ స్కీ ప్యాలెస్‌కు మోదీ వెళ్తారు. అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వాగతం పలుకుతారు. ఈ ప్యాలస్‌లో ఇద్దరూ కలిసి ప్రైవేట్ మీటింగ్‌లో కీలక అంశాలపై చర్చలు జరుప‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement