Friday, November 22, 2024

ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి, ఆగని రష్యన్‌ ఆర్మీ దాడులు.. శవాల దిబ్బగా మరియుపోల్‌

రష్యా దాడులకు ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. జనావాసాలే లక్ష్యంగా రష్యా బలగాలు దాడులకు తెగబడుతున్నాయి. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఓ థియేటర్‌పై జరిపిన దాడిలో సుమారు 300 మంది వరకు చనిపోయినట్టు ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం శథవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఖర్కీవ్‌, మరియుపోల్‌ ఇప్పటికే పూర్తిగా నేలమట్టం అయ్యాయి. కీవ్‌ను స్వాధీనం చేసుకుంటే విజయం మనదే ఆలోచనలో పుతిన్‌ ఉన్నారు. ఆ దిశగా రష్యా బలగాలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరియుపోల్‌లో ఇంకా వేలాది మంది బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వారు ఉక్రెయిన్‌ సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నా.. రష్యా బలగాలు బాంబులు, క్షిపణులతో దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. తాజాగా మరియుపోల్‌లోని ఓ థియేటర్‌పై రష్యా దాడి చేయగా.. 300 మంది చనిపోయినట్టు తెలుస్తున్నది.

వందలాది మందికి గాయాలు…

ఉక్రెయిన్‌ వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మరియుపోల్‌లో వందలాది మంది నివాసం ఉంటున్నారు. రష్యా దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి.. ఇళ్లను వదిలేసి.. ఓ థియేటర్‌లో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రష్యా ఆర్మీ.. క్షిపణితో విరుచుకుపడింది. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఇది ఒక డ్రామా థియేటర్‌గా స్థానికలు తెలిపారు. థియేటర్‌పై జరిగిన దాడిలో వందలాది మంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరియుపోల్‌లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న వారికి తినడానికి తిండి, తాగడానికి నీరు లేని పరిస్థితి ఉంది. ఎలాంటి విరామం లేకుండా.. మరియుపోల్‌, కీవ్‌, ఖర్కీవ్‌పై రష్యా బలగాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. మృతుల్లో చిన్నారులతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు. క్షిపణులు, బాంబులు, షెల్లింగ్స్‌తో రష్యన్‌ ఆర్మీ దాడులు చేస్తూనే ఉంది.

16,100 మంది రష్యన్లు హతం..

రష్యా సైనికులను తాము ధీటుగా ఎదుర్కొంటున్నామని, కీవ్‌ నగరం తమ ఆదీనంలోనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌ను రష్యాకు అప్పగించేదే లేదని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో.. తమ కంటే రష్యాకే ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా సంభించిందని తెలిపింది. 16,100 మంది రష్యా సైనికులను తాము హతమార్చినట్టు పేర్కొంది. 561 యుద్ధ ట్యాంకులు, 1625 సాయుధ శకటాలు, 115 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లతో పాటు భారీగా యుద్ధ సామాగ్రిని ధ్వంసం చేసినట్టు తెలిపింది. నాటో హెచ్చరికను లెక్కచేయని పుతిన్‌… దాడులను రెట్టింపు చేశారు. ఉక్రెయిన్‌ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాండ్‌ సిటీకి అమెరికా అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో.. పుతిన్‌ దూకుడు పెంచాడు. ఉక్రెయిన్‌ నుంచి లక్షలాది మంది ప్రజలు పోలాండ్‌కు వలస వచ్చారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement