హైదరాబాద్ : రష్యా ఉక్రెయిన్ మధ్య ఏడు నెలలుగా యుద్ధం కొనసాగుతుంది. ప్రపంచంలో చాలా దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలుస్తున్నాయి. కొన్ని దేశాలు రష్యాకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ భారత్ మాత్రం తఠస్థ వైఖరిని కొనసాగిస్తుంది. తాము శాంతిని కోరుకుంటున్నామని, యుద్ధాన్ని దౌత్యపరమైన చర్చలు జరుపుకుని విరమించుకోవాలని భారత్ ఇరు దేశాలకు సూచిస్తుంది. కానీ ఎవరికి మద్దతు అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకుని తమ భూభాగంగా ప్రకటించుకుంది. తమ భూభాగంలో ఎవరైనా దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిస్తున్నాడు. రష్యా క్రిమియా మధ్య ఉన్న బ్రిడ్జిని ఉక్రెయిన్ పథకం ప్రకారం కూల్చివేసింది. రష్యా ఆధీనంలోని బ్రిడ్జ్ ని ఉక్రెయిన్ కూల్చివేయడంతో మాస్కో ప్రతీకార చర్యగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై బాంబుల వర్షం కురిపించింది. ప్రధానంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్ స్కీ కార్యాలయంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కీవ్ లోని పలువురు పౌరులు మరణించగా.. భారీగా ఆస్తి నష్టం వాటిళ్లింది. ఈ దాడులపై ప్రపంచ దేశాలు రష్యా వైఖరిపై భగ్గుమంటున్నాయి. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి.
తాజాగా నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఖండించింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి 143 మంది అనుకూలంగా, వ్యతిరేకంగా ఐదుగురు సభ్యులు ఓటువేశారు. భారత్ సహా 35 దేశాలు తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్‌లో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరుల మరణాలతో సహా ఘర్షణలు తీవ్రం కావడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తీర్మానం సందర్భం ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. మానవ వ్యయంతో ఎలాంటి పరిష్కారాన్ని చేరుకోలేమని, శత్రుత్వాలు పెరగడం ఎవరికీ ప్రయోజనం కాదని భారతదేశం స్థిరంగా వాదిస్తున్నదని పేర్కొన్నారు. దౌత్య పద్ధతిలో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలని రుచిరా పిలుపునిచ్చారు. మెజారిటీ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్నప్పటికీ భారత్ మాత్రం ఏమీ తేల్చడం లేదు.
భారత్ తఠస్థ వైఖరి…
భారత్ వైఖరిపై పలు దేశాలు మండి పడుతున్నప్పటికీ మరికొన్ని దేశాలు భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఓటింగుల్లోనూ భారత్ దూరంగా ఉందంటే దీనికి గల కారణాలు ఏమిటని పలు దేశాలు ప్రశ్నిస్తున్నప్పటికీ భారత్ వెన్నకి తగ్గడం లేదు. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు సాగడం తోపాటు రష్యాతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తుంది. అలాగే ఉక్రెయిన్ కు కావాల్సిన మౌలిక వసతుల ఎగుమతులు, దిగుమతులను కొనసాగిస్తుంది. రష్యా నుంచి సైతం భారత్ ఎగుమతులు, దిగుమతులను కొనసాగిస్తుంది. ఇరు దేశాలతో భారత్ స్నేహపూరిత భావంతో మెలగడం చూస్తున్న అగ్రరాజ్య అమెరికాకు రుచించడం లేదు. భారత్ మాత్రం ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చలు జరుపుకుని ఈ యుద్ధాన్ని ముగించాలని మొదటి నుంచి నొక్కి చెబుతున్న మాట ఇది. మొత్తానికి భారత్ తీసుకున్న నిర్ణయాలే ఈరోజు భారత్ ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు దోహద పడే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు అంటున్నారు.
యుద్ధం ఆపేశక్తి భారత్ కే ఉంది..!
ఏడు నెలలుగా ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలంటే భారత్ జోక్యం చేసుకుంటేనే సాధ్యమని పలు దేశాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ముందునుంచే భారత్ శాంతి మంత్రాన్ని జపిస్తూ వస్తుంది.. ఇదే మంత్రంతో ఇరు దేశాల అధ్యక్షులతో సంప్రదించి యుద్ధం ముగించే శక్తి భారత్ కు ఉందని పలువురు ఆర్ధిక వేత్తలతోపాటు, నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్ని దేశాలతో భారత్ కు మంచి సత్సంభందాలు ఉన్నందున భారత్ ఈ యుద్ధం విషయంలో జ్యోక్యం చేసుకుని విరమించేలా చూడాలని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్ స్కీ కోరారు. భారత్ మాత్రం ఇదరుదేశాల మధ్యలో చర్చలు జరుపుకోవాలని సూచిస్తుంది తప్ప ఇప్పటి వరకు జ్యోక్యం చేసుకోలేదు. మరి భారత్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుదోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఇండియా వైపు సూస్తున్నాయి.