రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో వంటనూనెల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎఫ్‌ఎఓ ఆహార ధరల సూచీ ప్రకారం సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో సహా వంటనూనెల ధరలు 23.2శాతం పెరిగాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు పెరిగాయి. ప్రధానంగా ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల ప్రజలను ఆకలి బాధ వెంటాడుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) శుక్రవారం వెల్లడించింది. ఎఫ్‌ఎఓ నివేదిక ప్రకారం ఆహార ధరలు ఫిబ్రవరిలో పోలిస్తే మార్చిలో 12.9శాతం పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా,ఉక్రెయిన్ వాటా 30శాతం, 20శాతాలుగా ఉన్నాయి.
ఈ రెండుదేశాల మధ్య యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోయి ఆహార ధాన్యాల ధరలు 17.1శాతం పెరిగాయని ఎఫ్‌ఎఓ తెలిపింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతుల్లో ఉక్రెయిన్, రష్యా మొదటి రెండుస్థానాల్లో ఉన్నాయి. యుద్ధప్రభావంతోపాటు ఆంక్షల కారణంగా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ఈనేపథ్యంలో గోధుమ, వంటనూనెల ఎగుమతులకు అంతరాయం ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు ఎరువులు, ఇంధన ధరలు కూడా పెరగడంతో ఆహార ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..