న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై బీజేపీ నేతలు మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ (బీజేపీ) మాట్లాడుతూ అవగాహన లేకుండా సనాతన ధర్మాన్ని తప్పుబడుతూ విమర్శించారని అన్నారు. ఉదయనిధి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు వెంకట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని, అందులో కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారని గుర్తుచేశారు.
అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ వ్యాఖ్యలను సమర్థించినట్టే కదా అని అన్నారు. దేవాలయాల్లో జరిగే పూజలను సంస్కృతంలో కాకుండా తమిళంలో నిర్వహించాలని కూడా వితండవాదం చేస్తున్నారని మాధవ్ మండిపడ్డారు. సనాతన ధర్మంపై మాట్లాడే శక్తులపై చర్యలు తీసుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు. సనాతన ధర్మం ఒక కులానికో, ఒక మతానికో చెందింది కాదని వెల్లడించారు. సనాతన ధర్మంపై దాడి ద్వారా దేశంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.