Friday, November 22, 2024

ఉబెర్‌ కప్ సింధు టీం ఔట్‌.. క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓటమి..

న్యూఢిల్లి: ఉబెర్‌ కప్‌ టోర్నీ నుంచి భారత మహిళల జట్టు వైదొలగింది. ఒలింపిక్‌ పతక విజేత, ప్రపంచ నంబర్‌ 7 ర్యాంకర్‌ భారత షట్లర్‌ పీవీ సింధు సారథ్యంలోని మహిళల జట్టు థాయిలాండ్‌ చేతిలో 0-3 తేడాతో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో సింధు, ప్రపంచ నంబర్‌ 8 ర్యాంకర్‌ రాచనోక్‌ ఇంటనాన్‌ చేతిలో 21-18, 17-21, 12-21 తేడాతో పోరాడి ఓటమిని చవిచూసింది. 59నిముషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో దూకుడుగా ఆడిన పీవీ సింధు తర్వాత రెండు వరుస సెట్లలో ఓడిపోయింది. ఇంటనాన్‌తో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన సింధు, నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. 7 మ్యాచ్‌లో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్‌ విభాగం మ్యాచ్‌లో శ్రుతి మిశ్రా, సిమ్రన్‌ సింఘి జోడి 16-21, 13-21 తేడాతో జాంగ్‌ కోల్పాన్‌, రవిండ ప్రజోంగ్‌ జాయ్‌ చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో కశ్యప్‌ కూడా 16-21, 11-21 తేడాతో చోచువాంగ్‌ చేతిలో పరాజయం పాలైంది.

దీంతో థాయ్‌లాండ్‌ టీం 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఫలితంగా మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేకుండానే థాయ్‌లాండ్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. బుధవారంనాడు గ్రూప్‌డీ చివరి మ్యాచ్‌లో కూడా సింధు జట్టు కొరియా చేతిలో 0-5తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అప్పటికే కొరియా జట్టు రెండు విజయాలతో క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరింది. మరో వైపు పురుషుల విభాగంలో భారత షట్లర్‌, వరల్డ్‌ నంబర్‌ 9 క్రీడాకారుడు లక్ష్యసేన్‌ తన ప్రత్యర్థి మలేసియా క్రీడాకారుడు లీ జీ జియా చేతిలో 23-21, 21-9 తేడాతో పరాజయం పాలయ్యాడు. సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడి కూడా ప్రత్యర్థి మలేసియా క్రీడాకారులు గోహ్‌జి షెల్‌, నుర్‌ ఇజుద్దీన్‌ ద్వయం చేతిలో ఓటమిని చవిచూసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement