Tuesday, November 26, 2024

UAE – ఏడారిలో కుంభవృష్టి – దంచికొడుతున్న వ‌డ‌గ‌ళ్ల వాన‌

24 గంట‌లుగా ఆగ‌కుండా కురుస్తున్న వ‌ర్షాలు
అటు య‌మ‌న్, ఇటు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ అతాలాకుతలం
న‌దులను తలపిస్తున్న రహదారులు
చెరువులుగా మారిన విమానాశ్ర‌యాలు
75 ఏళ్ల త‌ర్వాత అతిపెద్ద కుంభ‌వృష్టి
మ‌రో 24 గంట‌ల పాటు కుమ్ముడే
భయపెడుతున్న ఉరుములు, మెరుపులు
ఇళ్ల‌లోంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావద్ద‌ని హెచ్చ‌రిక‌లు
మాల్స్, కార్యాల‌యాలు, విద్యా సంస్థ‌లు మూసివేత
ఇప్ప‌టికే 18 మంది చనిపోయినట్టు ప్రకటించిన అధికారులు

ఏడారి దేశాలైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. యెమన్‌లో కురిసిన ఎడతెరిపిలేని వానలకు 18మంది చనిపోయారు. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రోడ్లు, వీధులన్నీ జలదిగ్బంధం అయ్యాయి. భారీ వరదలకు దుబాయి వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు వరదలో చిక్కుకుపోయాయి. ఓవైపు వరదలు, మరోవైపు తీవ్రగాలుల కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. యూఏఈలో మొత్తం పాఠశాలలను మూసివేశారు. చాలా మంది ఉద్యోగులు, కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు.

యెమ‌న్ లో 18 మంది మృతి

వీధులు, రోడ్లపై ఉన్న వరద నీటిని ట్యాంకర్ల సహాయంతో తొలగిస్తున్నారు. మరోవైపు యూఏఈ పొరుగునున్న యెమన్‌లో కూడా మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లు, వీధులు మొత్తం నీటితో నిండిపోయాయి. ఈ భారీ వర్షాలకు 18 మృతి చెందారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని యెమన్‌ అత్యవసర నిర్వహణ కమిటీ తెలిపింది. బహ్రెయిన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా దేశాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్‌ తల్లడిల్లిపోయింది. ఎడతెగని వర్షాలు వీధులు, ఇళ్లు, మాల్స్‌ను జలమయం చేశాయి. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి.

- Advertisement -

నేడు కూడా భారీ వ‌ర్షాలే

సోమవారం అర్థరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం రాత్రి వ‌ర‌కూ కొన‌సాగాయి. జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏడాది మొత్తం మీద కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం అతలాకుతలమైపోయింది. 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. దుబాయ్, అబుదాబి, షార్జా ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోయే 48 గంటల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని స్థానిక జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాత్రి వ‌ర‌కూ ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జాతీయ వాతావరణ కేంద్రం నిపుణుడు అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ.. దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. ప్రజలు తమ వాహనాలను వరద ప్రాంతాలకు దూరంగా. సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలలో పార్క్ చేయాలని సూచించారు.

మెట్రో సేవ‌లు బంద్ .. విమానాలు మ‌ళ్లింపు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. తుపాను కారణంగా మంగళవారం మధ్యాహ్నం 25నిమిషాల పాటు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశామని, ఆ తరువాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అయితే.. చాలా వ‌ర‌కు విమానాలను ఇత‌ర ఎయిర్ పోర్ట్ ల‌కు దారిమ‌ళ్లించామ‌ని తెలిపారు. మరోవైపు మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక వందలాది మంది జనం దుబాయ్ మాల్‌లో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ అంతటా పాఠశాలలను మూసివేశారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 80 మిల్లీమీటర్ల (3.2 అంగుళాలు) కంటే అధిక వర్షపాతం నమోదయ్యింది.

నీటి ముంపులో ఎయిర్​పోర్టు, మెట్రో స్టేషన్లు

దుబాయ్‌లో కురిసిన భారీ వర్షానికి విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 24 గంటల్లో దాదాపు 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక రోజులో దాదాపు 1.5 సంవత్సరాల సగటు వర్షపాతం. తుపాను కారణంగా పలు పాఠశాలలను మూసివేయగా, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ భారీ వర్షాలు దాదాపు అన్ని అరబ్ దేశాలలో విపత్తుకు కారణంగా నిలిచాయి. వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వర్షపాతం సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement