దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్లు జోరు కొనసాగిస్తున్నారు. అజేయంగా దూసుకుపోతున్న టీమిండియా.. లీగ్ దశలోని ఆఖరి మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. బ్లూమ్‌ఫోంటెన్ వేదికగా ఇవ్వాల (ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏతో తలపడిన యువభారత్ 201 పరుగుల తేడాతో గెలుపొంది సూపర్ సిక్స్‌కు చేరుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా భారీస్కోర్‌ను సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసి.. యూఎస్‌ఏ ముందు 327 పరుగుల భారీ టార్గెట్‌ను సెట్ చేసింది. ఇక చేజింగ్‌కు దిగిన అమెరికా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 201 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో నమన్ తివారీ అత్యధికంగా 4 వికెట్లు సాధించాడు. ఇక రాజ్ లింబాని, సౌమీ పాండే, మురుగన్ అభిషేక్, ప్రియాంషు మోలియా చెరో వికెట్ దక్కించుకున్నారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ బ్యటర్లలో.. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (108) సెంచరీతో మెరిశాడు. ముషీర్ ఖాన్ (73) ఫామ్ కొనసాగించాడు. ఆఖర్లో కెప్టెన్ ఉదయ్ సహరన్ (35), ప్రియాన్షు మోలియా (27), సచిన్ దాస్ (20)లు ధాటిగా ఆడి భారత్‌కు భారీ స్కోరు సాధించిపెట్టారు. కాగా పేరుకు యూఎస్‌ఎ టీమ్ అయినా యూఎస్‌ఎలో ఆడుతున్న క్రికెటర్లందరూ భారత్ సంతతి వాళ్లే కావడం గమనార్హం.