దొంగలు తెలివి మీరుతున్నారు. పక్కా ప్లాన్‌తో చాలా ఈజీగా లక్షలు కాజేస్తున్నారు. అరుగుపై కూర్చున్నట్లు నటిస్తూనే.. ఇళ్లల్లోకి చొరబడి మొత్తం కాజేస్తారు. అంతేకాదు ఇంటి యజమానినే మీరెవరని ప్రశ్నిస్తారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరులోని కంకిపాడులో ఓ అత్త, కోడలు ఈ తరహా దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కారు.
వివరాల్లోకి వెళితే.. కంకిపాడు బస్టాండ్ సమీపంలోని ఓ వీధిలో ఇద్దరు మహిళలు అరుగుపై కూర్చున్నట్టుగా నటిస్తూ… గడియ వేసి ఉన్న ఇంట్లో తలుపులు పగులగొట్టిలోపలికి ప్రవేశించారు. బంగారు నగలు, వస్తువులను సంచిలో వేసుకున్నారు. అనంతరం టీవీ చూస్తూ ఉండగా.. ఇంటి యజమాని వచ్చారు. మీరు ఎవరు? ఏం కావాలి అని యజమానిని దొంగలు అడగ్గా.. అతడు అవాక్కయ్యాడు. ’నా ఇంటికి నేను అడిగి రావడమేంటి? అసలు ఎవరు మీరు? నా ఇంట్లో మీరేం చేస్తున్నారు?‘ అంటూ నిలదీశాడు. దీంతో వాళ్లిద్దరూ కాస్త టెన్షన్ తో అతడిని లోపలికి లాగబోయారు. ఈ లోపే అతడు వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలు విజయవాడలోని మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, సాత్వితలు అని తేలింది. అంతేకాదు ఇద్దరూ అత్తాకోడళ్లేననీ, దొంగతనాలే వృత్తిగా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.