లండన్‌లోని హీత్రూ ఎయిర్ పోర్టులో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు విమానాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకుని మరో ప్రదేశానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
అది టెర్మినల్ వద్ద బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఎయిక్రాప్ట్ను తాకడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇరు సంస్థలు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ధ్రువీకరించాయి. తమ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత మేరకు దెబ్బతిన్నదో ఇంజినీర్లు అంచనా వేస్తున్నారని బ్రిటీష్ ఎయిర్వేస్ పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన వెంటనే బృందం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నాయి. ఇంజినీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయని, ప్రస్తుతం వాటిని సర్వీసు తాత్కాలికంగా నిలిపివేసినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ విమానం అందించినట్లు పేర్కొంది.