Thursday, November 21, 2024

శ్రీమంత్ హత్యకేసులో ఇరువురికి జీవితఖైదు

చేబ్రోలు : చేబ్రోలు సర్పంచిగా ఉన్న వాసిరెడ్డి శ్రీమంత్ హత్య కేసులో చేబ్రోలులోని గొల్లపాలెంకు చెందిన గట్టుపల్లి పాండురంగారావు, అల్లం శ్రీనివాసరావులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తీర్పునిచ్చారు. గట్టుపల్లి పాండురంగారావు ఎండోమెంట్ శాఖలో వేమూరు నియోజకవర్గంలోని దోనేపూడి దేవాలయాలకు మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2007 సంవత్సరంలో చేబ్రోలుకు చెందిన వాసిరెడ్డి శ్రీమంత్ సర్పంచిగా ఎన్నికయ్యారు. ఇతనిపై కుట్రపన్నిన ప్రత్యర్ధులు దారికాసి నారా కోడూరు నుండి చేబ్రోలు వస్తుండగా శ్రీమంత్ పై బాంబులు వేసి వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు.

అప్పట్లో సంచలనం కలిగించిన ఈ కేసుకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సైతం బాధ్యత కుటుంబాన్ని పరామర్శించడానికి చేబ్రోలు వచ్చారు. ఈ కేసును అప్పటి తెనాలి రూరల్ సీఐ ప్రభాకర్ దర్యాప్తు చేసి ముద్దాయిలను కోర్టుకు అప్పగించారు. ఈ కేసులో మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా, 11 మంది విచారణ ఎదుర్కొన్నారు. 302, 120బీ లతోపాటు హామ్ షాట్, బాంబింగ్ తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం న్యాయమూర్తి పార్థసారథి ఈ కేసులో ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటుగా సుమారు రూ.20 వేల జరిమానా విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement