హైదరాబాద్, ఆంధ్రప్రభ: వ్యవసాయమే జీవనోపాధిగా చిక్కని అడవిలోని గిరిజన తాండాల సాగుభూములకు నీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆదిలాబాద్ గిరిజన తాండాలకు, వ్యవసాయయోగ్యమైన భూములకు సాగునీరు, జనవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో మరో రెండు రిజర్వాయర్లను ప్రభుత్వం ప్రకటించి నిధులు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వాయర్లు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం అదేశించింది. పెన్ గంగా నీటిప్రవాహం ఉన్నంతవరకు చనాకా-కొరాట బ్యారేజీ ద్వారా 51 వేల ఎకరాలకు నీరు అందించే అవకాశాలున్నాయి. నవంబర్ మాసం నుంచి పెన్‌గంగా నీటిప్రవాహంతగ్గుతుండటంతో ఆయకట్టు స్థిరీకరణ సవాళ్లను అధిగమించడానికి, వరదకాలంలో అవసరమైన చోట నీటిని నిల్వచేసుకుంటేనే గిరిజన తాండాల్లోని సాగుభూమికి నీరందించే అవకాశాలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిప్పల్ కోటి, గోముత్రి రిజర్వాయర్లను ప్రతిపాదించింది.
పిప్పల్ కోటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్..
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి, గొల్లఘాట్ తవ్షీు గ్రామాల మధ్య సహజ లోయ వద్ద ప్రభపత్వం పిప్పల్ కోటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించడానికి ప్రతిపాదించింది. ఈ రిజర్వాయర్‌లో 1.423 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో పెన్‌గంగా రిజర్వాయర్ కింద ప్రధాన కాలువ 47కి.మీ నుంచి 89.09కి.మీ వరకు నిర్మించడంతో 37, 500 ఎకరాల ఆయకట్టుకు నవంబర్ నుంచి జనవరి వరకు సాగునీరు అందించేందుకు అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.283.58 కోట్ల అంచనాతో డీపీఆర్ రూపొందించి అంతరాష్ట్ర అనుమతులను కూడా ప్రభుత్వం సాధించింది. అలాగే భూసేకరణ కోసం రూ.437 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టు స్థిరీకరణ 37,500 ఎకరాలు సాగులోకి రానుంది.
గోముత్రి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్..
ఆదిలాబాద్ జిల్లాల్లోని భీంపూర్ మండలంలో గోముత్రి గ్రామం దగ్గర స్థానిక వాగుపై గోముత్రి రిజర్వాయర్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. 8,660ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీరు అందనుంది. దిగువ పెన్‌గంగా కింద ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు డీపీఆర్ రూపొందించారు. గోముత్రి వాగుపై లభ్యమయ్యే 1.255 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మాణాన్ని నీటిపారుదల శాఖ చేపట్టింది. అయితే డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ పరిశీలనకు పంపించారు. త్వరలో టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు దట్టమైన అడవుల్లో నిర్మిస్తుండటంతో గిరిజన తాండాల నీటి సమస్యలు పరిష్కారమై అదనంగా ఆయకట్టు స్థిరీకరణ జరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.