Tuesday, November 26, 2024

మారుతీ నుంచి మరో రెండు మోడళ్లు.. కొత్త ఎస్‌యూవీలను లాంచ్‌ చేయనున్న కంపెనీ

ఎస్‌యూవీ సిగ్మెంట్‌లో వెనుకబడి ఉన్న మారుతీ సుజుకీ మరో 10 రోజుల్లో రెండు కొత్త మోడళ్లను మార్కెట్‌ లో విడుదల చేయనుంది. నాన్‌ ఎస్‌యూవీ కార్ల మార్కెట్‌లో 65 శాతం వాటా కలిగి ఉన్న కంపెనీ, ఎస్‌యూవీ విభాగంలో మాత్రం బాగా వెనుకబడి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ కంపెనీలకు చెందిన 46 ఎస్‌యూవీ మోడళ్లు ఉంటే , మారుతీ సుజుకీకి చెందినవి రెండు మాత్రమే ఉన్నాయి. బ్రిజా, గ్రాండ్‌ విటారా మోడళ్లు మాత్రమే మారుతీ సుజుకీ ప్రస్తుతం విక్రయిస్తోంది. అన్ని విభాగాల్లో కలిసి 50 శాతం మార్కెట్‌ వాటా సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవా చెప్పారు. 10 రోజుల్లో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో మారుతీ ఈ కొత్త మోడళ్లను ఆవిష్కరించనుంది.


2022లో మారుతీ సుజుకీ అప్‌ గ్రేడ్‌ చేసిన, కొత్త మోడళ్ల 9 వాహనాలను మార్కెట్‌లో విడుదల చేసింది. డిమాండ్‌కు తగిన విధంగా సప్లయ్‌ చేయలేకపోతున్నామని ఆయన చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించామన్నారు. కంపెనీకి చెందిన ఎర్టిగా, ఎక్‌ఎల్‌ 6, గ్రాండ్‌ విటారా, బ్రిజా, డిజైర్‌, స్విఫ్ట్‌ మోడల్స్‌ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వస్తోందని, దీన్ని తగ్గించేందుకు ఉత్పత్తి పెంచాలని నిర్ణయించామన్నారు. 2022లో పరిశ్రమలో అత్యధికంగా అమ్ముడైన కారుగా వ్యాగనార్‌ నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement