33 సంవత్సరాల క్రితం జరిగిన కాశ్మీర్ వేర్పాటువాది మిర్వాయిజ్ మౌల్వీ మొహమ్మద్ ఫరూఖ్ హత్య కేసులో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదిన్ టెర్రరిస్టులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమ్మూ కాశ్మీర్ సీఐడీ ప్రత్యేక డీజీపి రష్మి రంజన్ స్వయిన్ మాట్లాడుతూ తప్పించుకొని తిరుగుతున్న టెర్రరిస్టులను రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అరెస్టు చేసిందని తెలిపారు. ”చట్టం తాలూకు అతి పొడవైన చేతులు తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు నిందితులు జవయిద్ అహ్మద్ భట్, జహూర్ అహ్మద్ భట్‌ను ఎట్టకేలకు పట్టుకున్నాయి.
వారిని సీబీఐకి అప్పగిస్తాం” అని తెలిపారు. కాశ్మీర్‌లో హెడ్ ప్రీస్ట్‌గా ఉన్న మిర్వాయిజ్ ఫరూఖ్‌ను హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులు 1990, మే 21న హత్య చేశారు. హత్య చేసిన తర్వాత నిందితులిద్దరూ పాకిస్థాన్‌కు అక్కడి నుంచి నేపాల్‌కు పారిపోయారని స్వయిన్ తెలిపారు.
కొద్ది సంవత్సరాల క్రితం వారు కాశ్మీర్‌కు తిరిగి వచ్చారని తెలిపారు. ”కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే మరణించారు. మరొక నిందితుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇప్పటి దాకా తప్పించుకొని తిరుగుతున్న మిగిలిన ఇద్దరు ఎట్టకేలకు నేడు అరెస్టయ్యారు” అని ప్రత్యేక డీజీపీ అన్నారు. ఇద్దరి అరెస్టుతో మిర్వాయిజ్ హత్య కేసులో న్యాయం జరిగిందని తెలిపారు.