తిరుమల, ప్రభ న్యూస్ : లోకకల్యాణం కోసం బ్రహ్మ వేంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుడికి ఏటా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. వేంకటేశ్వరుడు తిరుమల ఆనందనిలయంలో కొలువైన కన్యామాసం (ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. బ్రహ్మ ఆధ్వర్యంలో జరిగేవి కనుక ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్దిచెంది పురాణ కాలం నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదు కానీ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం,ధ్వజావరోహణం ఉండవు. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సెప్టెంబర్ 18 న ధ్వజారోహణం, సెప్టెంబర్ 22న గరుడ వాహనం, సెప్టెంబర్ 23న స్వర్ణరథం, సెప్టెంబర్ 25న రథోత్సవం (మహారథం), సెప్టెంబర్ 26 న చక్రస్నానం, ధ్వజావరోహణం జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబర్ 19న గరుడవాహనం, అక్టోబర్ 22 న స్వర్ణరథం, అక్టోబర్ 23 న చక్రస్నానం జరగనున్నాయి.
ఆర్జిత సేవల రద్దు
బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు, అక్టోబర్ 15 నుంచి 23వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు మాత్రమే అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబర్ 14న సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దుచేసింది.