Saturday, November 23, 2024

ట్విటర్‌ బ్లూటిక్‌ ఇక మూడు రంగుల్లో

ట్విటర్‌ బ్లూటిక్‌ సేవలు వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బ్లూటిక్‌ సేవల్లో గణనీయమైన మార్పుులు చేస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. వెరిఫైడ్‌ ఖాతాలకు వేరువేరు రంగులు కేటాయించనున్నట్లు తెలిపారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ ఖాతాలకు స్పష్టమైన తేడా ఉండేలా వేరువేరు రంగులతో బ్యాడ్జ్‌లు ఇవ్వనున్నట్లు మస్క్‌ తెలిపారు.
డిసెంబర్‌ 2 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన వెరిఫైడ్‌ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. కంపెనీలకు గోల్డ్‌, ప్రభుత్వ ఖాతాలకు గ్రే, వ్యక్తులకు బ్లూ టిక్‌ ఇవ్వనున్నట్లు వివరించారు. ఖాతాదారుల వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే ఈ వెరిఫైడ్‌ టిక్‌ను కేటాయించస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం వెల్లడిస్తామన్నారు. విద్వేషాన్ని, హింసను ప్రేరేపించే ఖాతాలను సస్పెండ్‌ చేస్తామని చెప్పారు.

ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేయకముందు ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీతారలు, ఇతర సెలబ్రిటీల ఖాతాలను తనిఖీ చేసిన తరువాతే బ్లూటిక్‌ ఇచ్చే వారు. మస్క్‌ దీన్ని కొనుగోలు చేసిన తరువాత ఈ విధానంలో మార్పు చేశారు. నెలకు 8 డాలర్ల ఫీజు చెల్లించే ప్రతివారికి బ్లూటిక్‌ ఇస్తామని ప్రకటించారు. దీంతో భారీ సంఖ్యలో నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో దీన్ని తాత్కాలికంగా నిలిపేశారు. తాజాగా అన్ని వివరాలు తనిఖీ చేసిన తరువాతే బ్లూటిక్‌ సర్వీస్‌ను ప్రారంభిస్తామని మస్క్‌ వెల్లడించారు. దీంతో పాటు మూడు రంగుల విధానాన్ని తీసుకు వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement