దిగ్గజ సామాజిక మాధ్యమం ట్విటర్ బ్లూ టిక్ చార్జీలను ప్రకటించింది. అదనపు ఫీచర్లతో కూడిన ట్విటర్ బ్లూ కోసం భారత యూజర్లు నెలకు రూ.900 చెల్లించాలని తెలిపింది. ఐఫోన్, ఆండ్రాయిడ్‌లకు ఒకే చార్జీని ప్రకటించింది. అదే వెబ్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఈ చార్జీలను రూ.650గా పేర్కొంది. వెబ్ యూజర్ల కోసం రూ. 6800తో ప్రత్యేక వార్షిక ప్లాన్‌ను విడుదల చేసింది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ భారీ మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా, ఆదాయాన్ని పెంచుకునేందుకు ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చారు.
ఈ ప్రత్యేక సేవలను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి ట్వీట్లను తొలగించడం, ఎడిట్ చేయడం వంటి అదనపు ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే అధిక నాణ్యతతో కూడిన సుదీర్ఘ వీడియోలను పోస్టు చేసేందుకు వీలవుతుంది. ప్రకటనలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ ఫొటో, డిస్ ప్లే నేమ్, యూజర్ నేమ్ మార్చడం చేయొద్దని వినియోగదారులను ట్విటర్ కోరింది. అలా చేస్తే తిరిగి వాటిని ధ్రువీకరించే వరకు బ్లూ టిక్ సేవలు నిలిపివేస్తామని వెల్లడించింది.