హైదరాబాద్ – పట్టెడు అన్నం కోసం విద్యార్దులు పోరాటం చేయాల్సిన దుస్థితి నేటి కాంగ్రెస్ పాలనలో కనిపిస్తున్నదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు… రైతులు, విద్యార్ధులు, సామాన్యులు, అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ అగచాట్లపాలు చేస్తున్నదంటూ ఫైర్ అయ్యారు.. ఈ మేరకు ఆయన ట్వట్ చేశారు.. నీలి మేఘాల్లో సీఎం రేవంత్ ఉంటే నీలి నీడల్లో గురుకులాల భవిష్యత్తు ఉందన్నారు. పట్టెడు అన్నం కోసం విద్యార్థుల పోరాటం చేస్తుంటే మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటపడుతున్నారని ఆరోపించారు.
కంచంలోనే కాటేసే పాములు
కంచం లో పురుగులు,కాటేసే పాములు ఉంటున్నాయని కెటిఆర్ వివరించారు.. కారణం లేని మరణాలతో విద్యార్థుల పోరాటం చేస్తుంటే అదానితో దోస్తీ చేసి,అల్లుడి ఆస్తుల కోసం రేవంత్ ఆరాట పడుతున్నారని వ్యాఖ్యానించారు. కనీస వసతులు లేక,సరిపడా మరుగుదొడ్లు లేక,అనారోగ్యాలతో విద్యార్థుల పోరాటం చేస్తున్నారన్నారు. లగచర్ల పై లాఠీ విరిచి ,రైతుల నడ్డి విరిచి ఫార్మా పేరుతో భూదందాకై రేవంత్ ఆరాటపడుతున్నారన్నారు. పురుగుల అన్నం తిని అంబులెన్స్ లో విద్యార్థులు హాస్పటల్స్ కు వెళుతుంటే పంచభక్ష పరమాన్నాలు తిని హెలికాఫ్టర్ లో రేవంత్, మంత్రుల షికార్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మూసీలో లక్షల కోట్లు కుమ్మరిస్తున్న ముఖ్యమంత్రి విద్యార్థి కడుపుకు నాణ్యమైన బుక్కెడు బువ్వ కోసం ఖర్చుపెట్టవా? అంటూ నిలదీశారు మాజీ మంత్రి కెటిఆర్.