Sunday, November 24, 2024

Twit : రేవంత్ రెడ్డిది నరం లేని నాలుక : కేటీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది నరం లేని నాలుక అని.. ఏదైనా మాట్లాడుతుందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని ఆక్షేపించారు. పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రజా వ్యతిరేక చర్యలను ఖండిస్తునే ఉంటామని హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్‌లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసం అని స్పష్టంగా వెల్లడించారని అన్నారు. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేయలేదా అని ప్రశ్నించారు.

‘మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా’ అని నిలదీశారు. ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా అని అడిగారు. ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారని ప్రశ్నించారు. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్ధాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement