కేరళలోని ఎర్నాకులం సమీపంలో ఉన్న కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో పేలుళ్లు జరిగి ఒక వ్యక్తి మరణించగా, సుమారు 40 మందికి తీవ్ర గాయాలైన ఘటనలో కీలక పరిణామం జరిగింది. ఈ పేలుళ్లకు కారణం తానే అంటూ ఆదివారం సాయంత్రం ఒక వ్యక్తి త్రిస్సూర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. 48 ఏళ్ల డామినిక్ మార్టిన్ తానే కన్వెన్షన్ సెంటర్‌లో బాంబు పెట్టినట్టు అంగీకరించాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. దీనిపై కలమస్సెరీ ADGP ఎమ్ఆర్ అజిత్ కుమార్ స్పందించారు. అయితే నిజంగా పేలుడు అతడే చేసిండా లేదా అనేది పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు.
కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు ఒక కాల్ వచ్చింది. అందులో ఎర్నాకులంలోని కలమస్సేరిలో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్‌లో పేలుడు సంభవించిందని చెప్పారు. 5 నిమిషాల విరామం తర్వాత రెండో పేలుడు సంభవించింది. రెండు పేలుళ్ల తర్వాత ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. పేలుడు ధాటికి అక్కడ మంటలు చెలరేగాయి. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి పరుగులు తీయడం ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, 15-20 నిమిషాల విరామం తర్వాత మూడవ పేలుడు కూడా జరిగింది. ఈ పేలుడులో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 7 మంది పరిస్థితి విషమంగా ఉంది, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.