ఇస్తాంబుల్: టర్కీ కేంద్రంగా నేటి ఉదయం సంభవించిన పెను భూకంపం వల్ల టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటికే సుమారు 2 వేల మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు.. అయితే ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య దాదాపు పది వేలకు చేరే అవకాశం ఉన్నట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. దక్షిణ టర్కీలో 7.8 తీవ్రతతో ఇవాళ తెల్లవారుజామున అత్యంత శక్తివంతమైన భూకంపం నమోదు అయిన విషయం తెలిసిందే. భూకపం తీవ్రతకు అత్యధిక జనవాసాలు కలిగిన భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి.. ఈ రెండు దేశాలలో వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి.. శిధిలాల కింద వేలాదిమంది చిక్కుకున్నారు.. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి..
పలుదేశాలు టర్కి, సిరియా దేశాలకు విపత్తు సహాయ బృందాలను పంపాయి.. భారత్ కూడా అత్యవసరంగా సహాయ సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేసింది.. కాగా,ఈ ప్రాంతంలో వచ్చిన భూకంపాల చరిత్ర ఆధారంగా యూఎస్‌జీఎస్ మరణాలను ఈ అంచనా వేస్తోంది. షేకింగ్ ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో ఉండే జనాభా ఆధారంగా కూడా ఈ లెక్క వేయనున్నారు. అత్యంత ప్రభావానికి గురైన ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌ల ఆధారంగా కూడా మరణాల సంఖ్యను అంచనా వేయనున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే ఛాన్సు ఉందని, నష్టం కూడా విస్తృత స్థాయిలో ఉంటుందని, ఇంకా ఆ భూకంప ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. కనీసం పదివేల మందకి పైగా మరణాలు సంభవించి ఉండవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. తాజా భూకంపం వల్ల ఆర్ధిక నష్టం బిలియన్ డాలర్ నుంచి పది బిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నష్టం మొత్తం టర్కీ జీడీపీలో రెండు శాతం వరకు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.