న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లోకల్ అడ్వైజరీ కమిటీ (ఎల్ఏసీ) ఛైర్‌పర్సన్‌గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలోని టీటీడీ బాలాజీ మందిర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి సహా దేవస్థానం ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఢిల్లీ సహా ఉత్తరాదిన ఉన్న టీటీడీ ఆలయాల నిర్వహణ బాధ్యతల్ని ఈ కమిటీ చేపట్టనుంది. కమిటీలో వైస్ ప్రెసిడెంట్‌గా బి. మదన్ మోహన్ రెడ్డితో పాటు మరో 27 మంది సభ్యులుగా ఉన్నారు. కమిటీ నేతలందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండో పర్యాయం ఈ కమిటీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ కమిటీ పరిధిలో ఢిల్లీలోని టీటీడీ బాలాజీ మందిర్‌తో పాటు రిషికేశ్, కురుక్షేత్ర, జమ్ము పట్టణాల్లో ఉన్న టీటీడీ ఆలయాలు ఉన్నాయి. రెండోసారి కమిటీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఆమె శాలువా కప్పి సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్వహణ బాధ్యతలు తనకు వరుసగా రెండోసారి దక్కడం తన అదృష్టంగా ఆమె పేర్కొన్నారు.