Wednesday, November 20, 2024

Delhi | ఢిల్లీలో టీటీడీ బ్రహ్మోత్సవాలు.. మే 3న అంకురార్పణతో ప్రారంభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మే 3 నుంచి 13 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం ఆలయ మండపంలో మీడియా సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవాల వివరాలను వెల్లడించారు. మే 3న అంకురార్పణతో ప్రారంభమై, మే 13న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆమె తెలిపారు. వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మే 8న స్వామి వారి కళ్యాణంతో పాటు ఆర్జిత సేవ, గరుడవాహన సేవ జరుపుతామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో వాహనసేవ ఉంటుందని, పెద్దశేషవాహనం, హంస వాహనం, ముత్యాల పందిరి వాహనం, సర్వభూపాల వాహనం, గరుడ వాహనం, గజ వాహనం, చంద్రప్రభ వాహనం, అశ్వ వాహనంతో సేవ నిర్వహిస్తామని తెలియజేశారు.

ఉదయం పూట చిన్నశేష వాహనం, సింహ వాహనం, కల్పవృక్ష వాహనం, మోహినీ అవతారం, హనుమంత వాహనం, సూర్యప్రభ వాహనం, రధోత్సవం (మిథున లగ్నం)తో పాటు కన్యాలగ్నంలో యమునా నది తీరాన చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, భోజనం ఏర్పాటు చేశామని, ఆలయంలో లడ్డు కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు భవన్ లలో సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆమె ఆహ్వానించారు.

ఢిల్లీ ఆలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ.. యాగశాల నిర్మాణం పూర్తయిందని, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా మే 8న ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆలయంలో ఇది వరకు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఆలయాలకు సంబంధించిన కార్యక్రమాలను, కళ్యాణాలను నిర్వహించినప్పటికీ ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని సూచించారని, ఆ కారణంగా ఇతర దేవస్థానాల కార్యక్రమాలను నిలిపివేశామని వివరించారు.

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో టీటీడీ సమాచార కేంద్రాన్ని కోవిడ్-19 సమయంలో మూసేశామని, ఆ తర్వాత దర్శనాలన్నీ ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుకింగ్ సదుపాయం కల్పించినందున సమాచార కేంద్రాన్ని మళ్లీ తెరవాల్సిన అవసరం రాలేదని అన్నారు. అయితే ఏపీ భవన్‌కు వస్తున్న సందర్శకులు చాలా మంది టీటీడీ సమాచార కేంద్రానికి వచ్చి వెనుదిరుగుతున్నందున త్వరలోనే దాన్ని తెరుస్తామని చెప్పారు. మరోవైపు జమ్ము నగరంలో టీటీడీ ఆలయ నిర్మాణం జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. జూన్ 3న కుంభాభిషేకంతో మొదలై 8న విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement