Tuesday, November 26, 2024

టీటీడీ తలనీలాలపై దుష్ప్రచారం

మయన్మార్ సరిహద్దులో టీటీడీ తలనీలాల వివాదంపై అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి స్పందించారు. టీటీడీ తలనీలాలపై కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలోని హిందువులందరూ తిరుమలను ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తారని, టీటీడీపై అనవసర ప్రచారం చేయడం తగదన్నారు. మయన్మార్ సరిహద్దులో దొరికిన తలనీలాల సీజడ్ రిపోర్టులో టీటీడీ పేరు లేదని స్పష్టం చేశారు. రూ. 18.17 లక్షల అన్ ప్రోసెసడ్  హెయిర్ ను పట్టుకున్నట్టు కస్టమ్ అధికారులు తెలిపారని వివరించారు. టీటీడీలో ప్రోసస్ చేయకుండా తలనీలాలు విక్రయించమని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతతో తలనీలాలను తిరుమల నుండి తిరుపతికి తరలిస్తామని, ఒక్క వెంట్రుక కూడా దొంగతనంగా బయటకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. చీప్ పాపులారిటీ కోసం కొన్ని మీడియా చానళ్లు టీటీడీ ఉద్యోగులపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుష్ప్రచారంపై టీటీడీ ఉద్యోగులు బాధపడుతున్నారని తెలిపారు. ఆరుగురిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారని టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.

కాగా, మిజోరాం నుంచి మయన్మార్‌కు 120 బస్తాలలో ఓ వాహనం ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న తలనీలాలను అస్సాం రైఫిల్స్‌ బలగాలు జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఆ తలనీలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది. తిరుమలలో భక్తులు సమర్పించే తలనీలాలను ఈ– టెండర్ల ద్వారా వేలం నిర్వహించి విక్రయిస్తుంటామని తెలిపింది. టెండర్‌లో ఎక్కువ మొత్తం కోట్‌ చేసిన బిడ్డర్‌ నుంచి జీఎస్టీ కట్టించుకుని తలనీలాలు అప్పగిస్తున్నామని వివరించింది.  కొనుగోలు చేసిన బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులున్నాయా? లేక దేశంలో ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదని తెలిపింది. దేశంలోని అనేక ఆలయాల్లో తలనీలాల విక్రయాలు జరుగుతుంటాయని, టీటీడీ కూడా ప్రతి 3 నెలలకోసారి ఈ–టెండర్‌ ద్వారా తలనీలాలు విక్రయించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని పేర్కొంది. తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే వాటిని బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని తెలిపింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement