Sunday, November 17, 2024

టీఎస్‌ఆర్టీసీకి త్వరలో 16 ఏసీ స్లీపర్‌ బస్సులు.. ప్రైవేటుకు దీటుగా ప్రయాణికులకు మెరుగైన సేవలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రైవేటుకు దీటుగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్‌ ఆర్టీసీ సిద్ధమైంది. ఇప్పటి వరకు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రాష్ట్ర్రంలోని ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించే వారు. దీంతో ఆ సంస్థలు గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీఎస్‌ ఆర్టీసీ తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్‌ లగ్జరీ, నాన్‌ ఏసీ స్లీపర్‌, సీటర్‌ కమ్‌ స్లీపర్‌ బస్సులను ప్రారంభించిన సంస్థ సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మరింత చేరువయ్యే దిశగా హైటెక్‌ హంగులతో ఏసీ స్లీపర్‌ బస్సులను రూపొందించింది. ప్రైవేట్‌ బస్సులకు దీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్‌ బస్సులు మార్చి నెలలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ఏసీ స్లీపర్‌ బస్సులకు లహరిగా నామకరణం చేశారు.

- Advertisement -

కర్నాటకలోని బెంగళూరు, హుబ్లి, ఏపీలోని విశాఖపట్టణం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై నగరాలకు సంస్థ ఈ కొత్త బస్సులను నడుపనుంది. ఈమేరకు బస్‌భవన్‌ ప్రాంగణంలో కొత్త ఏసీ స్లీపర్‌ బస్సు నమూనాను టీఎస్‌ ఆర్టీసీ ఎండి విసి సజ్జన్నార్‌ సోమవారం పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పించనున్న సౌకర్యాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో తొలిసారిగా అందుబాటులోకి రానున్న ఏసీ స్లీపర్‌ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా సజ్జన్నార్‌ వ్యక్తం చేశారు. ఈ కొత్త స్లీపర్‌ బస్సుల ద్వారా సంస్థ భారీగా అదాయం పొందే అవకాశం ఉందన్నారు.

కాగా, టీఎస్‌ ఆర్టీసీ త్వరలో ప్రారంభించనున్న 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్‌ బస్సులో లోయర్‌ 15, అప్పర్‌ 15తో 30 బెర్తుల సామర్ధ్యం కలిగి ఉంటుంది. బెర్త్‌ల వద్ద వాటర్‌ బాటిల్‌ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్‌ చార్జింగ్‌, రీడింగ్‌ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వాటిని హైదరాబాద్‌లోని టీఎస్‌ ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేశారు. అలాగే, ప్రతీ బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు బస్సు రివర్స్‌ తీసుకునేందుకు వీలుగా రివర్స్‌ అసిస్టెన్స్‌ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement