హైదరాబాద్, ఆంధ్రప్రభ : వాహన కాలుష్యం నియంత్రణ, పెరుగుతున్న డీజిల్ వ్యయ భారం నుంచి తగ్గించుకునేందుకు ఎల్రక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు టీఎస్ ఆర్టీసి నిర్ణయించింది. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్ వ్యయం ఆర్టీసీకి పెను సవాల్‌గా మారింది. డీజిల్ రేట్లు పెరిగినప్పుడల్లా ఆర్టీసీ యాజమాన్యం బస్సు చార్జీల పెంపు పేరుతో ప్రయాణికులపై భారం మోపుతున్నది. గతంలోనూ డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ చార్జీలను పెంచింది. అయినప్పటికీ సంస్థ నష్టాల బాటలోనే పయనిస్తున్నది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ ఆర్టీసి నిర్ణయించింది. ఇందులో భాగంగానే త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది.
టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి డిసెంబర్ లేదా జనవరి నుంచి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను నడప నున్నారు. అయితే, ముందుగా ప్రయోగాత్మకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను కొన్ని రూట్లలో నడపాలని అధికారులు భావిస్తున్నారు. నగరంలోని మూడు మార్గాలలో తొలుత వీటిని అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తున్నారు. ఏయే రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులను నడిపించాలి అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్లై ఓవర్లు లేని మార్గాలలో వీటిని నడిపించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దాదాపు 20 ఏళ్ల క్రితం డబుల్ డెక్కర్ బస్సులు నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ నెటిజన్ ట్విట్టర్‌లో నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను నడిపే ఆలోచన ఏమైనా ఉందా అని మంత్రి కేటీఆర్‌ను అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ దీనిపై పరిశీలించాలని మంత్రికి సూచించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించడంతో నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా ఫ్లై ఓవర్లు లేని రూట్లలో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను నడపడానికి టీఎస్ ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.