Friday, November 22, 2024

నష్టాల బాట నుంచి గట్టెక్కుతున్న టీఎస్‌ ఆర్టీసీ.. 13 నుంచి 26కు చేరిన బస్‌ డిపోల సంఖ్య

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నష్టాలతో కునారిల్లుతున్న టీఎస్‌ ఆర్టీసీ లాభాల బాట దిశగా పయనిస్తున్నది. సంస్థ మనుగడే కష్టమై సిబ్బంది నెలవారీ వేతనాల కోసం ప్రభుత్వంపై ఆధారపడే స్థితి నుంచి డిఏలు ప్రకటించే స్థాయికి చేరుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల వేతనంతో పాటు ఒక డిఏను కూడా ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంస్థ ఎండి సజ్జన్నార్‌ ప్రకటించడం ఇందుకు నిదర్శనం. దాదాపుగా పదేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి సజ్జన్నార్‌ నేతృత్వంలో అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తుండటంతో ఇది సాధ్యమైందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. గత ఏడాది జూలైలో డీజిల్‌ సెస్‌ను సవరించడం ద్వారా రోజువారీ టికెట్‌ ఆదాయాన్ని ఆర్టీసీ భారీగా పెంచుకుంది. డీజిల్‌ సెస్‌ను సెవరించిన తరువాత 13 బస్‌ డిపోలు లాభాలు పొందుతుండగా, తాజాగా ప్రాఫిట్‌ చాలెంజ్‌ ప్రారంభించిన తరువాత ఆ సంఖ్య 26కు చేరుకోవడం గమనార్హం. కాగా, గత కొన్ని నెలలుగా ఆర్టీసీలో రకరకాల చాలెంజ్‌లు నిర్వహిస్తున్నారు. పర్వదినాలు, ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా ప్రయాణికులను ఆకర్శించే పథకాలను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా రాఖీ పండుగ సందర్భంగా నిర్వహించిన రాఖీ చాలెంజ్‌తో ఒక్క రోజే సంస్థకు రూ.20 కోట్ల ఆదాయం లభించింది.

- Advertisement -

శ్రావణ మాసంలో మహిళలకు టికెట్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించడంతో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించారు. ఈ కొత్త ప్రయత్నం రాష్ట్రంలోని ఆయా డిపోలకు భారీ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అలాగే, 3 నెలల పాటు డిపోలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టేలా సంస్థ 100 రోజుల చాలెంజ్‌ నిర్వహించి గరిష్ట ఆదాయాన్ని పొందింది. మరోవైపు, ప్రాఫెట్‌ చాలెంజ్‌లో భాగంగా రోజువారీ ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టడంతో పాటు ఖర్చులను తగ్గించడంపైనా సంస్థ యాజమాన్యం దృష్టి సారించింది. ఇందుకు 15 అంశాలను ప్రాతిపదికనగా నిర్ణయించగా, వాటిని ఎలా నిర్వహించాలో డిపో మేనేజర్లు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దీంతో సిబ్బంది రేయింబవళ్లు సంస్థ లాభాల దిశగా పయనించడానికి శ్రమిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 డిపోలు లాభాల జాబితాలో చేరగా, మరో 10 డిపోల్లో రోజువారీ రూ. లక్షలోపు నష్టాలలో ఉన్నాయి. ఇంకో 10 డిపోల్లో నష్టాలు రూ.2 లక్షల లోపు ఉన్నాయి.

లాభాల్లో ఉన్న డిపోలు ఇవే….

ప్రస్తుతం రాష్ట్ర్రంలోని 26 బస్‌ డిపోలు లాభాల జాబితాలో ఉన్నాయి. వాటిలో : ఇబ్రహీంపట్నం, జగిత్యాల, గోదావరిఖని, కరీంనగర్‌-1, వనపర్తి, సిద్దిపేట, వరంగల్‌-1, నల్లగొండ, యాదగిరిగుట్ట, హన్మకొండ, కోదాడ, జనగామ, మెదక్‌, వేములవాడ, సంగారెడ్డి, దేవరకొండ, భూపాలపల్లి, మణుగూరు, మహేశ్వరం, పరిగి, నర్సాపూర్‌, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి, హైదరాబాద్‌-1,2 పికెట్‌ ఉన్నాయి. కాగా, డిపోల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టిస్తూ విసిరిన ప్రాఫిట్‌ చాలెంజ్‌ కూడా ఇప్పుడు సత్పలితాలను ఇస్తున్నది. దీంతో ఇదే పద్దతిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని సంస్థ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో వచ్చే మరో 6 నెలల్లో టీఎస్‌ ఆర్టీసీ పూర్తి స్థాయిలో లాభాల బాట పడుతుందని ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement