హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాఖీ పౌర్ణమికి టీఎస్‌ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ ఆదేశించారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను ఈనెల 29, 30,31 తేదీలలో ప్రతీ రోజు 1000 చొప్పున నడపనున్నట్లు వివరించారు. రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై శనివారం సజ్జన్నార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల తదితర రూట్లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.
గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారని గుర్తు చేశారు. ఫలితంగా ఒక్క రోజే సంస్థకు రూ.20 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది స్ఫూర్తితో ఈ రాఖీ పౌర్ణమి నాడు కూడా ఇలాగే పని చేయాలని సూచించారు.
టీఎస్ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత సంస్థపై బాధ్యత మరింతగా పెరిగిందనీ, ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరు తీసుకు రావాలన్నారు. పండుగ నాడు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ఇబ్బందులకు గురి కావొద్దనీ, టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా సజ్జన్నర్ ప్రయాణికులకు సూచించారు.