Thursday, November 21, 2024

లాభదాయక రూట్లపై టీఎస్‌ ఆర్టీసీ నజర్‌.. ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు బదులు సూపర్‌ లగ్జరీలు నడిపే యోచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆదాయాన్ని పెంచుకునే దిశగా అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని టీఎస్‌ ఆర్టీసీ వినియోగించుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా లాభదాయకమైన రూట్లలో సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు సంస్థకు ఆదాయం తెచ్చిపెడుతున్న 150 రూట్లను గుర్తించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉన్న రూట్లలో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రవేశపెడితే టికెట్‌ల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల టికెట్‌ ధర కంటే సూపర్‌ లగ్జరీ కేటగిరీ టికెట్‌ ధర చాలా ఎక్కువ. రద్దీ మార్గాలైనందున సూపర్‌ లగ్జరీ బస్సులు కూడా ఎక్కువ ఆక్యుపెన్సీతోనే నడుస్తాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ రూట్లలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు బదులు సూపర్‌ లగ్జరీ బస్సులను నడపగా ఇదే విషయం స్పష్టమైంది. దీంతో ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రూట్లలో బస్సు కేటగిరీని అప్‌గ్రేడ్‌ చేసి లగ్జరీ బస్సులను నడపాలన్న నిర్ణయానికి ఆర్టీసీ అధికారులు వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆర్టీసీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సర్వీసుల్లో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ముఖ్యమైనవి. ఇవి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం నుంచి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, కామారెడ్డి,ఆదిలాబాద్‌, ఖమ్మం వంటి ప్రధాన పట్టణాలతో పాటు ఏపీలోని విజయవాడ, కాకినాడ, రాజమండ్రి పట్టణాలు ఉన్నాయి. వీటి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం వరకూ ఉంటోంది. ఈ రూట్ల ద్వారానే ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. కాగా, టీఎస్‌ ఆర్టీసీ తాజాగా 600 కొత్త లగ్జరీ బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ బస్సులు ఈనెల నుంచే దశలవారీగా ఆర్టీసీకి చేరనున్నాయి. ఈ బస్సులను విడుతల వారీగా ఆయా రూట్లలో నడపనుంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పోలిస్తే సూపర్‌ లగ్జరీలో ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. సహజంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు టికెట్‌ దర ఎక్కువైనా సుఖవంతమైన ప్రయాణాన్నే కోరుకుంటారు.

ప్రయాణికులకు ఆర్థికంగా భారమైనప్పటికీ మెరుగైన ప్రయాణ వసతి కల్పిస్తున్నామనే పేరుతో ఆర్టీసీ తమ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఫలితంగా ఆర్టీసీకి భారీ ఎత్తున ఆదాయం సమకూరనుంది. ఇక ప్రస్తుతం ఉన్న పాత లగ్జరీ బస్సులను ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులుగా మారుస్తోంది. గరిష్ట పరిమితి మేర తిరిగిన వాటిని బాడీ మార్చి ఎక్స్‌ప్రెస్‌ కొత్త బాడీలు కట్టించి నడపనుంది. అలా ఎక్స్‌ప్రెస్‌లుగా మారిన పాత సూపర్‌ లగ్జరీ బస్సుల స్థానంలో కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement