Friday, November 22, 2024

TS RTC | మరో 1000 బస్సుల కొనుగోలుకు టీఎస్‌ఆర్టీసీ యోచన.. ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌ వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ లక్ష్యంగా టీఎస్‌ ఆర్టీసీ మరో 1000 బస్సులను కొనుగోలు చేయనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లోగా ఈ బస్సులు దశలవారీగా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగర శివార్లలో భారీ సంఖ్యలో వెలుస్తున్న కాలనీలకు ప్రత్యేక కనెక్టివిటీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈమేరకు సోమవారం టీఎస్‌ ఆర్టీసీ ఎండి మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన చిట్‌ చాట్‌లో పలు విషయాలను వెల్లడించారు. ఎప్పటి నుంచో నష్టాల బాటలో ఉన్న టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికుల ఆదరణతో ఇప్పుడిప్పుడే లాభాలు ఆర్జిస్తున్నదని పేర్కొన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఆకర్శించేందుకు కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రైళ్ల మాదిరిగా బస్సుల రాకపోకల వివరాలను ప్రయాణికులు తెలుసుకునేందుకు వీలుగా నగరంలోని ముఖ్యమైన బస్టాండ్లలో ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా ఇప్పటికే రావాల్సిన డీఏలు మంజూరు చేస్తున్నామనీ త్వరలోనే సిసిఎస్‌ నిధులు చెల్లించేందుకు రుణాల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

రూ.100 చెల్లిస్తే 24 గంటలు ప్రయాణించే వీలున్న టీ-24 టికెట్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. అలాగే, 30 లేదా 40 కి.మీ.ల పరిధిలో రూ.50 టికెట్‌ను ప్రవేశపెట్టే దిశగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా రూ.1500 కోట్లను టీఎస్‌ ఆర్టీసీకి విడుదల చేస్తున్నదనీ, అయినప్పటికీ కార్పొరేషన్‌ సొంతంగా ఆదాయం సమకూర్చుకునే యోచనలో ఉందన్నారు. టీఎస్‌ ఆర్టీసీ ప్రజలకు సుదూర ప్రాంతాలకు తక్కువ టికెట్‌ రేట్లకే మెరుగైన రవాణా సేవలు అందిస్తున్న దృష్ట్యా ప్రైవేటు బస్‌ ఆపరేటర్లు కూడా తమ దారిలోనే ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.

నేడు మెగా రక్తదాన శిబిరాలు-101 ప్రాంతాల్లో క్యాంపులు

రక్తదానం పట్ల సిబ్బందిలో, ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తూ టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం కొన్నేళ్లుగా రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్ర్రవ్యాప్తంగా 101 ప్రాంతాలలో బ్లడ్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఎంజీబీఎస్‌లో రక్తదాన శిబిరాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి విసి సజ్జన్నార్‌తో కలసి ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి సజ్జన్నార్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రతీ విద్యా సంస్థ నుంచి 20 నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొని రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపటి భవిష్యత్‌ కోసం ప్రతీ ఇంట్లోనూ ఒక రక్తదాతను తయారు చేయాల్సిన అసవరం ఉందన్నారు. ఆ దిశగా బాల్యం నుంచే రక్తదానం గురించి పిల్లలకు తల్లిదండ్రులు వివరించాలనీ, రాష్ట్ర్రవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఈ రక్తదాన శిబిరాలకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులతో పాటు రెడ్‌ క్రాస్‌ సొసైటీ కూడా టీఎస్‌ ఆర్టీసీకి సహకరించనున్నాయనీ, అలాగే, తమ స్నేహితులు, బంధువులు, ప్రయాణికులు ఉదారంగా రక్తదానం చేసేలా ఉద్యోగులు కృషి చేయాలని కోరారు.

ముందస్తు రిజర్వేషన్‌ చార్జీలు తగ్గింపు

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్‌ చార్జీలను టీఎస్‌ ఆర్టీసీ సవరించింది. రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ సర్వీసుల్లో 350 కి.మీ.ల లోపు రూ.20గా, 350 ఆపై కి.మీ.కు రూ.30గా నిర్ణయించింది. సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుంటే రూ.30 వసూలు చేయనుంది.

టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు మంచి స్పందన ఉందనీ, ప్రతీ రోజు సగటున 15 వేల వరకు తమ టికెట్లను ప్రయాణికులు రిజర్వేషన్‌ చేసుకుంటున్నారని టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి విసి సజ్జన్నార్‌ తెలిపారు. వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్‌ చార్జీలను తగ్గించడం జరిగిందనీ ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని సంస్థను ఆదరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement