హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతిలో సరైన వైద్య సౌకర్యాలు లేక ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఉండేది. అయితే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీగా విసి సజ్జన్నార్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆసుపత్రి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. టీఎస్ ఆర్టీసీలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులు ఉండగా, ఈ ఆసుపత్రికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతీ రోజు 1200 నుంచి 1300 మంది వరకు ఉద్యోగులు వైద్య సేవల కోసం వస్తుంటారు.
వీరికి వైద్య పరీక్షలతో పాటు అవసరమైన మందులను కూడా సిబ్బంది ఉచితంగా అందజేస్తున్నారు. అలాగే, 24 గంటల పాటు డయాగ్నస్టిక్స్ సేవలు, కార్డియాలజీ, నెఫ్రాలజీ, గైనిక్ సేవల కోసం పూర్తి స్థాయి సిబ్బందిని నియమించారు. ఈసీజీ, ఐసీయూ సేవలు అందుబాటులోకి రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే పరిస్థితి తప్పింది. ఈ ఆసుప్రతిలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, విసి సజ్జన్నార్ చొరవతో డయాలసిస్ యూనిట్‌ను ఏర్పాటు చేసి కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలతో పాటు లాప్రోస్కోపిక్ సర్జరీలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా టీఎస్ ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల కోసం గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది..
కార్యక్రమంలో భాగంగా నవంబర్ నెలలో సంస్థలో ఉన్న 50 వేల మంది ఉద్యోగుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. ఇందులోకం ఆర్టీసీ ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, రాష్ట్రంలోని 98 ప్రాంతాలలో డయాగ్నస్టిక్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతీ రోజు 1800 మంది ఉద్యోగుల ఆరోగ్య వివరాలను సేకరించాలని ఆర్టీసీ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం సంస్థ ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేసింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ఏ ఉద్యోగి అయినా, దీనిని వినియోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఉద్యోగులకు అందుతున్న వైద్య సేవలను తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.