హైదరాబాద్, ఆంధ్రప్రభ : రోజురోజుకూ తడిసి మోపెడవుతున్న నిర్వహణా వ్యయం నుంచి బయటపడటానికి ప్రయాణికులపై డీజిల్ సెస్ విధించినా.. టీఎస్ ఆర్టీసి నష్టాల బాట నుంచి గట్టెక్కడం లేదు. డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో గత జూన్‌లో ప్రయాణికులపై డీజిల్ సెస్ విధించాలని టీఎస్ ఆర్టీసి నిర్ణయించింది. అప్పటికే పెరిగిన భారీ చార్జీలతో ప్రయాణికులపై పడిన ఆర్థిక భారం తడిసి మోపెడు అవుతుండగా, మరోసారి డీజిల్ సెస్ పెంచింది. ప్రయాణికులు ప్రయాణించే దూరాన్ని బట్టి డీజిల్ సెస్ విధించిన ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు నుంచి మొదలుకుని డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్సీస్ బస్సుల వరకు దీనిని వర్తింపజేసింది.
పల్లె వెలుగుకు 250 కి.మీ.ల దూరం వరకు రూ.5 నుంచి 45, ఎక్స్‌ప్రెస్ 500 కి.మీ.ల దూరం వరకు రూ.5 నుంచి 90, డీలక్స్ 500 కి.మీ.ల వరకు రూ.5 నుంచి 125 వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆర్టీసీకి ప్రతీ రోజూ నష్టాలే వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. టీఎస్ ఆర్టీసీ ప్రతీ రోజు తెలంగాణతో పాటు పొరుగున ఉన్న ఏపి, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రకు 10,460 బస్సులను నడుపుతున్నది. ఇందుకు గాను ప్రతీ రోజు 5.43 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నది. ప్రస్తుతం డీజిల్ రేటు లీటరుకు 27 శాతం వ్యాట్‌తో కలిపి రూ. 97.82గా ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీకి డీజిల్‌పై రాయితీ ఇచ్చేది. ప్రస్తుతం దానికి బదులు టీఎస్ ఆర్టీసీకి వార్షిక బడ్జెట్లో రూ.1000 కోట్లను కేటాయించింది. అయితే, ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌లో కనీసం అందులో నాలుగో శాతం నిధులు కూడా విడుదల చేయలేదని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిధులు విడుదల చేస్తే ఆర్టీసీని నష్టాల బాట నుంచి గట్టెక్కించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.