నష్టాల ఊబిలో పీకలలోతు వరకు కూరుకుపోయిన టీఎస్‌ఆర్‌టీసీ ఆదాయార్జన కోసం పాఠశాల, కళాశాల విద్యార్థులను కూడా వదలడం లేదు. కరోనాతో ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందుల పాలైతే మాకేం సంబంధం లేదన్నట్లుగా ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థుల పాస్ రెన్యువల్ ఆలస్యమైందన్న కారణంలో ఏకంగా రూ.100 జరిమానా వసూలు చేస్తోంది. అదేంటీ కరోనా కారణంంగా ప్రభుత్వమే స్కూల్, కళాశాలలు బంద్ పెడితే మేం బస్సులో తిరిగేందుకు పాస్‌లు రెన్యువల్ చేసుకోవాలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు నివారణా ఛర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేసింది. దీంతో విద్యార్థులెవరూ ఆర్టీసీ పాస్‌లను వినియోగించుకోలేదు. తిరిగి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి యధావిధిగా పాఠశాలలు, కళాశాలలు తెరుచు కోవడంతో బస్‌పాస్‌ల రెన్యువల్‌కు ఆర్టీసీ బస్‌పాస్ కౌంటర్ల వద్ద క్యూలుకట్టారు. బస్ పాస్ గడువు తీరిన 20 రోజులలోపు బస్‌పాస్‌లను రెన్యువల్ చేస్తున్న అధికారులు 21 రోజు పైబడి రెన్యువల్ చేసుకోని బస్‌పాస్‌లకు రూ.100 జరిమానా విధిస్తున్నారు. బస్ పాస్‌లను వినియోగించుకోని వారికి గడువు పెంచాల్సిన ఆర్టీసీ యాజమాన్యం జరిమానా పేరుతో అదనపు డబ్బులు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిర్ణీత రోజులు ప్రయాణం చేయకపోతే ఆ గడువును పెంచలేదని, దీంతో తాము నష్టపోయామని, అయినా రెన్యువల్ చేయించుకునేందుకు వస్తే జరిమానా కట్టాలంటున్నారని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి గ్రేటర్ పరిధిలోనే దాదాపు రెండు లక్షలకు పైగా బస్‌పాస్‌లను ఆర్టీసీ జారీ చేసింది. ఇందులో దాదాపు 70 వేల వరకు పాస్‌ల రెన్యువల్ 21 రోజులకు పైబడి ఉన్నాయని సమాచారం. అంటే ఒక్క విద్యార్థుల బస్‌పాస్‌లపైనే ఆర్టీసీ దాదాపు రూ. 70 లక్షలను కొల్లగొట్టేందుకు సిద్దమైనట్లు స్పష్టమవుతోంది.
ఎప్పటి నుంచో అమలులో ఉంది : సీటీవో
బస్‌పాస్‌ల రెన్యువల్‌లో ఆలస్యమైతే రూ. 100 జరి మానా వసూలు అనేది కొత్తదేం కాదని చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీవన్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్ బస్‌పాస్‌ల జారీ ప్రక్రియను 2016లో ప్రారంభించడం జరిగిందని, అప్పుడే విద్యార్థుల బస్ పాస్‌ల గడువుకు కొంత పరిమితిని విధించడం జరిగిందని, పరిమితిని దాటిన బస్‌పాస్‌లను రెన్యువల్ చేయాలంటే రూ.100 జరిమానా వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. గడువు తీరిన 21రోజుల తర్వాత బస్ పాస్‌లను రెన్యువల్ చేయాలంటే జరిమానా చెల్లించకపోతే సిస్టం పని చేయదని తెలిపారు.
కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8 నుంచి పాఠశాలలు, కళాశాల లను మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆర్టీసీ బస్సులు నిలిచిపోలేదు కాబట్టి పాస్‌లను విద్యార్థులు రెన్యువల్ చేయించుకుంటే సరిపోయేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు పని చేయనప్పటికీ పాస్‌లను రెన్యువల్ చేశామన్నారు. రాయితీ పాస్‌లు కలిగి ఉన్న వారంతా గడువు తీరిన వారు లేరని, కొద్ది శాతం విద్యార్థులున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జరిమానా రద్దు చేసే విషయంలో ఉన్నతాధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..