తెలంగాణ ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి కొన్న వజ్ర బస్సులు తుక్కుగా మారనున్నాయి. వీటిని వినియోగించడం సాధ్యం కానందున పూర్తిగా వదిలించుకోవాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. స్ర్కాప్ పాలసీ కింద మినీ బస్సులను తుక్కుగా మార్చాలని అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణలోని వివిధ పట్టణాలకు ప్రయాణించే వారికి మెరుగైన సేవలు అందించేందుకు 2017లో 60 వజ్ర మినీ ఏసీ బస్సులను సంస్థ కొనుగోలు చేసింది. ఈ బస్సులకు సంబంధించి కేవలం ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఉండడం, ఛార్జీలు అధికంగా ఉండడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ బస్సులు కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ రేషియో కూడా సాధించలేకపోయాయి.
సెంట్రల్ ఏసీతో కూడిన ఒక్కో బస్సుకు అప్పట్లోనే టీఎస్ఆర్టీసీ రూ.70 లక్షలు వెచ్చించింది. ఫలితంగా రూ.40 కోట్లకు పైగా నిధులు వెచ్చించి కొన్న బస్సులు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. గత ఏడాది లాక్డౌన్ తర్వాత అన్ని బస్సులను దశల వారీగా రోడ్లపైకి తెచ్చిన ఆర్టీసీ.. వజ్ర బస్సులను మాత్రం బయటకు తీయలేదు. ఎక్కడికక్కడ షెడ్లకే పరిమితం చేసింది. వీటికి కనీస మెయింటెనెన్స్ చర్యలు సైతం చేపట్టకపోవడంతో తుప్పు పట్టిపోయాయి. మినీ బస్సులను ఉద్దేశపూర్వకంగానే గాలికొదిలేశారన్న విమర్శలు ఉండగా.. ఎలాగూ పనికిరాకుండా పోయినందున తుక్కుగా మార్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిస్తోంది.