సరకు రవాణా కోసం తెలంగాణ ఆర్టీసీ తెచ్చిన కార్గో సర్వీసులు ఫలితాలనిస్తున్నాయి. గతంలో ప్రజా రావాణాకే పరిమితమైన ఆర్టీసీ.. సరకు రవాణాలోనూ సత్తా చాటుతోంది. తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విశాఖకు కార్గో సేవలను టీఎస్ ఆర్టీసీ గురువారం ప్రారంభించింది. ఆర్టీసీ సంస్కరణల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్గో సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నష్టాలు పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా కార్గో, పార్శిల్ సేవల్ని టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కార్గో, పార్శిల్ సేవలను విస్తరించిన ఆర్టీసీ.. తాజాగా ఈ సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి విస్తరించింది.
కరోనా కారణంగా ఏర్పడిన నష్టాలను పూడ్చుకునే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. కొవిడ్‌తో ప్రయాణికులు తగ్గి కోల్పోయిన ఆదాయాన్ని కార్గో సేవల ద్వారా సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రారంభం నుంచే కార్గో సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తోంది. కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి.. ఈ సేవలు అండగా నిలుస్తున్నాయి. ఎరువులు, ధాన్యం, బియ్యం వంటివి రవాణా చేస్తూ ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలో కార్గో సేవలను మరింత విస్తరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వైసీపీ ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం