హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహిళలకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వేసవి నేపథ్యంలో జిహెచ్‌ఎంసి పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఈ టికెట్ కొనుగోలు ద్వారా 24 గంటల పాటు ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ కొత్త టికెట్ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. కాగా, ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు జీహెచ్‌ఎంసి పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చిన టి-24 టికెట్‌కు అనూహ్య స్పందన వస్తోందని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జన్నార్ తెలిపారు. సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను రూ.100 నుంచి 90కి తగ్గించామనీ, కొత్తగా సీనియర్ సిటిజన్లకు రూ.80కే అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు టి-24 టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేసి ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఆ ధర తగ్గింపు తరువాత సగటున ప్రతీ రోజు 40 వేల వరకూ టి-24 టికెట్లు అమ్ముడవుతున్నాయని చెప్పారు. దీంతో మహిళా ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు రూ.80కే టి-24 టికెట్ అందించాలని సంస్థ నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. అలాగే, మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-6 టికెట్‌ను ఇటీవల ప్రారంభించామనీ, రూ.50తో ఆ టికెట్‌ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చని తెలిపారు. హైదరాబాద్ సిటీలో తీసుకొచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి టీఎస్ ఆర్టీసీ బస్సులలో సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్న ఆర్టీసీని ప్రజలు ఆదరించాలనీ, ఆర్టీసీకి ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిదని ఈ సందర్భంగా బాజిరెడ్డి, సజ్జన్నార్ పేర్కొన్నారు.